Britain: ఇరాన్ పై యుద్ధానికి మేం దూరం.. అమెరికాకు బ్రిటన్ క్లారిటీ..!
అగ్రరాజ్యం అమెరికాకు మిత్రదేశం బ్రిటన్ గట్టిషాకిచ్చింది. ఎప్పుడు ఏ పరిణామం జరిగినా వెంట నడిచే గ్రేట్ బ్రిటన్.. ఇప్పుడు మాత్రం దూరంగా ఉంటామని తేల్చి చెప్పింది. ఇరాన్ పై వార్ సమయంలో తమ భూభాగాలను అందుబాటులో ఉంచేది లేదని స్పష్టం చేసింది. సాక్షాత్తూ బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్.. స్వయంగా ఈప్రకటన విడుదల చేశారు. ఈ పరిణామం అంతర్జాతీయంగానూ తీవ్ర చర్చనీయాంశమైంది.
అణు ఒప్పందంపై చర్చలు ఓ కొలిక్కి రాకపోవడంతో ఇరాన్‌పై దాడులకు అమెరికా(Iran strikes) సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఇరాన్‌పై దాడులకు తమ దేశంలోని రెండు కీలక స్థావరాలను వాడొద్దని యూకే (UK) అగ్రరాజ్యానికి తేల్చి చెప్పింది. దీంతో స్విండన్ సమీపంలోని ఫెయిర్ ఫోర్డ్ బేస్ నుంచి లాంగ్రేంజ్ బాంబింగ్ ఆపరేషన్లు నిర్వహించడానికి అగ్రరాజ్యానికి అవకాశం లేకుండా పోయింది. మరోవైపు ఇప్పటికే డియాగో గార్సియా బేస్‌ను మారిషస్‌కు తిరిగి అప్పజెప్పాలన్న యూకే నిర్ణయంపై ట్రంప్ అసంతృప్తి వ్యక్తంచేసిన నేపథ్యంలో తాజాగా ఆ దేశ ప్రభుత్వం అమెరికాపై ఈ నిషేధం విధించడం ఆసక్తిదాయకంగా మారింది.
ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని ఆపాలని కొంతకాలంగా అమెరికా ఆ దేశంపై ఒత్తిడి తీసుకువస్తోంది. ఈ విషయంలో జరుగుతున్న చర్చలు విఫలమైతే దాడులు చేస్తామని బెదిరించింది. ఇందుకోసం అనేక యుద్ధ నౌకలు, విమానాలు, సైనిక దళాలను ఇరాన్ వైపు తరలిస్తోంది. ఏ క్షణంలో అయినా ఇరాన్‌పై అగ్రరాజ్యం విరుచుకుపడే అవకాశం ఉందని యూఎస్ అధికారిక వర్గాలు వెల్లడించాయి. తాజాగా ఇరాన్‌తో చర్చల గురించి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడుతూ.. మరో 10 రోజుల్లో అణు ఒప్పందంపై తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. ఒకవేళ ఒప్పందం కుదరకపోతే యూకే విదేశీ భూభాగమైన డియాగో గార్సియా, ఫెయిర్ ఫోర్డ్ బేస్‌ల (RAF bases) మీదుగా టెహ్రాన్‌పై దాడులు చేస్తామన్నారు.
గల్ఫ్ దేశాలపైదాడులకు అమెరికా (USA) గతంలో ఫెయిర్ ఫోర్డ్ బేస్‌ను, హిందూ మహాసముద్రంలోని యూకే విదేశీ భూభాగమైన డియాగో గార్సియాను ఉపయోగించింది. ఈ నేపథ్యంలోనే మరోసారి ఆ దేశంపై ఆయా స్థావరాల నుంచి దాడులు చేయడానికి యూకేను అనుమతి కోరింది. ఈ క్రమంలోనే తమ బేస్‌లను ఉపయోగించవద్దని కీర్ స్టార్మర్ ప్రభుత్వం తేల్చిచెప్పింది.

















