ట్రంప్ వర్సెస్ వాటికన్.. దౌత్యమే ముద్దంటున్న పోప్…!
ఇరాన్ యుద్ధం విషయమై పోప్ విముఖంగా ఉన్నారా..? వేలాది మందిప్రాణాలు, ఆస్తి నష్టం సంభవించే యుద్ధం కన్నా.. దౌత్యమార్గాల్లో సమస్య పరిష్కరించుకోవాలని పోప్ భావిస్తున్నారా…? ట్రంప్ విధానాలపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారా..? అంటే అవుననే సమాధానం వస్తోంది.ముఖ్యంగా …యుద్ధం విషయంలో అమెరికా, వాటికన్‌ల మధ్య ఘర్షణ తలెత్తినట్లు తెలుస్తోంది. దౌత్యమార్గాల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని, యుద్ధంవల్ల అనేక ప్రమాదాలున్నాయని పోప్ వ్యాఖ్యానించడాన్ని అమెరికా జీర్ణించుకోలేకపోతున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే అసాధారణ చర్య చేపట్టినట్లు వార్తలొస్తున్నాయి. అమెరికాలో పోప్ రాయబారికి సమన్లు జారీ చేసినట్లు సమాచారం. యుద్ధం విషయంలో తమకే మద్దతు పలకాలని ఆయనపై ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి
చరిత్రలో తొలిసారిగా పోప్ అయిన అమెరికన్ లియో ఇటీవల మాట్లాడుతూ.. దౌత్యమార్గాల ప్రాధాన్యాన్ని, యుద్ధంవల్ల ప్రమాదాల గురించి చెప్పారు. దీనిపై గుర్రుగా ఉన్న పెంటగాన్ అధికారులు.. పోప్ రాయబారిని పిలిపించినట్లు తెలుస్తోంది. రహస్యంగా ఆయనతో సమావేశమైన అధికారులు.. క్యాథలిక్ చర్చి అమెరికాకే అండగా నిలవాలని డిమాండు చేసినట్లు సమాచారం. అమెరికాకు చెందిన ‘ఫ్రీ ప్రెస్’ నివేదిక ప్రకారం.. అమెరికా ప్రయోజనాల కోసమే వాటికన్ పని చేయాలని అధికారులు డిమాండు చేసినట్లు సమాచారం. అయితే అలాంటిదేమీ లేదని ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ స్పష్టం చేశారు.
అధ్యక్షుడు ట్రంప్ విధానాలను గతంలోనూ పలుమార్లు పోప్ విమర్శించారు. ముఖ్యంగా వలస విధానాలను, విదేశాంగ విధానంలో అనుసరిస్తున్న దుందుడుకు ధోరణిని ఆయన తప్పుబట్టారు. జనవరి 9వ తేదీన పోప్ వార్షిక ప్రసంగంలో చేసిన వ్యాఖ్యలు అమెరికాకు కోపం తెప్పించాయి. ‘యుద్ధం ఓ ఫ్యాషన్‌లా మారింది. దౌత్యం బలప్రయోగంపై, అంతర్జాతీయ పెత్తనంపై ఆధారపడుతోంది. వలసదారులపట్ల దురుసుతనం పెరిగింది’ అని పోప్ వ్యాఖ్యానించారు. ఇది ట్రంప్ యంత్రాంగాన్ని నేరుగా సవాల్ చేయడమేనని రక్షణశాఖ సహాయ మంత్రి ఎల్బ్రిడ్జ్ కోల్బీ అప్పట్లోనే విమర్శించారు.
ఇవి కూడా చదవండి






