US Elections: ఓటర్ ఐడీ.. పౌరసత్వ రుజువు కోసం ట్రంప్ డిమాండ్..!
అమెరికా రాజకీయాల్లో ఓటర్ ఐడీ వివాదం ప్రకంపనలు రేపుతోంది. పూర్తి పారదర్శకంగా ఎన్నికలు జరగాలంటే.. ఓటర్ ఐడీ, పౌరసత్వ రుజువు చూపించాల్సిందే అంటున్నారు అధ్యక్షుడు ట్రంప్. అమెరికా ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం కఠిన నిబంధనలు అవసరమంటున్నారు ట్రంప్. ఓటర్ ఐడీని జాత్యహంకారంతో ముడిపెట్టడం సరికాదన్నారు. 95 శాతం మంది ప్రజలు ఈనిబంధనలను కోరుకుంటున్నారని చెబుతున్నారు.
gerogia
గత ఎన్నికల్లో ఓటమి తర్వాత ట్రంప్ .. డెమొక్రాట్లపై తీవ్ర విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఎన్నికల్లో మోసం చేసేందుకు డెమొక్రాట్లు ఓటర్ ఐడీని వ్యతిరేకిస్తున్నారని ఆరోపిస్తున్నారు.అదేవిధంగా, పోస్టల్ బ్యాలెట్ (మెయిల్-ఇన్ బ్యాలెట్) విధానంపైనా ట్రంప్ విమర్శలు గుప్పించారు. కేవలం సైనికులు, అనారోగ్యంతో ఉన్నవారు, విహారయాత్రలకు వెళ్లిన వారికి మాత్రమే ఈ సౌకర్యం కల్పించాలని, మిగిలిన వారంతా నేరుగా పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు వేయాలని సూచించారు.
అయితే, ఓటర్ ఐడీ నిబంధనపై అమెరికాలో భిన్న వాదనలు ఉన్నాయి. ప్యూ రీసెర్చ్ సెంటర్ ప్రకారం దాదాపు 80-85 శాతం మంది ఈ నిబంధనను సమర్థిస్తున్నారు. మరోవైపు, దేశంలోని సుమారు 11 శాతం మంది అర్హులైన పౌరుల వద్ద (సుమారు 2.1 కోట్లు) ప్రభుత్వ ఫోటో ఐడీలు లేవని పౌర హక్కుల సంఘాలు చెబుతున్నాయి. వీరిలో ఆఫ్రికన్ అమెరికన్లు, లాటిన్ అమెరికన్లు అధికంగా ఉండటంతో, ఈ నిబంధన వివక్షకు దారితీస్తుందని డెమోక్రాట్లు, పౌర హక్కుల సంఘాలు వాదిస్తున్నాయి. గత ఎన్నికల ఫలితాల వివాదంతో జార్జియా రాజకీయ కేంద్రంగా మారిన నేపథ్యంలో ట్రంప్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

















