Iran-US War: యుద్ధం అమెరికాది.. ఖర్చు గల్ఫ్ దేశాలదా..?
పశ్చిమాసియా యుద్ధం ప్రభావం ప్రపంచదేశాలను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. నెలరోజుల యుద్ధంలో బిలియన్ డాలర్లు వ్యయమవుతున్నాయి. ఇప్పటికే అప్పుల ఊబిలో ఉన్న అమెరికాపై ఇది మరింత భారాన్ని పెంచుతోంది. ఇదే విషయమై ఇప్పటికే ఫెడ్ చైర్మన్ పావెల్ .. ఆందోళన వ్యక్తం చేశారు కూడా. అందుకే ఈ పరిణామం అమెరికా ఆర్థిక వేత్తలను కలవరానికి గురి చేస్తోంది. దీంతో దీనిపై అధ్యక్షుడు ట్రంప్, ఆయన సహచరులు, అధికార యంత్రాంగం ఫోకస్ పెట్టింది కూడా.
ఈ పరిస్థితుల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక సంచలన ప్రతిపాదనను తెరపైకి తెచ్చినట్లు తెలుస్తోంది. ఇరాన్ పై అమెరికా సైన్యం చేస్తున్న పోరాటానికి అవుతున్న వ్యయాన్ని సౌదీ అరేబియా, యూఏఈ వంటి సంపన్న అరబ్ మిత్రదేశాల నుంచి రాబట్టాలని ఆయన భావిస్తున్నట్లు శ్వేతసౌధ వర్గాల సమాచారం. ‘‘అమెరికా సైనికులు ప్రాణాలకు తెగించి పోరాడుతుంటే, దానివల్ల రక్షణ పొందుతున్న భాగస్వామ్య దేశాలే యుద్ధ ఖర్చును భరించాలి’’ అనేది ట్రంప్ ఆలోచనగా కనిపిస్తోంది.
ఇవి కూడా చదవండి
ఇరాన్ నుంచి ఎదురయ్యే ముప్పు నుంచి అరబ్ దేశాలను కాపాడేందుకు అమెరికా తన సైనిక శక్తిని, వనరులను వినియోగిస్తోందని, కాబట్టి ఆ యుద్ధానికి అయ్యే బిల్లును ఆ దేశాలే చెల్లించాలని ట్రంప్ గట్టిగా వాదిస్తున్నారు. ఈ విధానాన్ని ‘పే ఫర్ ప్రొటెక్షన్’ గా అభివర్ణిస్తున్నారు. ఇరాన్‌తో యుద్ధం కారణంగా అమెరికా ఆర్థిక వ్యవస్థపై పడుతున్న ట్రిలియన్ డాలర్ల భారాన్ని తగ్గించుకోవడమే ఈ ప్రతిపాదన వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యం. గతంలోనూ పలుమార్లు మిత్రదేశాలు తమ రక్షణ కోసం తగినంత ఖర్చు చేయాల్సి ఉంటుందని ట్రంప్ వ్యాఖ్యానించారు.
ట్రంప్ తాజా ప్రతిపాదనతో అరబ్ దేశాల్లో చర్చ మొదలైంది. ఒకవైపు ఇరాన్‌ను నిలువరించడానికి అమెరికా మద్దతు తప్పనిసరి కాగా, మరోవైపు యుద్ధ వ్యయాన్ని పూర్తిగా భరించడంపై ఆ దేశాలు ఆలోచనలో పడ్డాయి. ఈ నిర్ణయం అమెరికా-అరబ్ దేశాల మధ్య దౌత్య సంబంధాలను దెబ్బతీసే ప్రమాదం ఉందని, కేవలం డబ్బు కోసమే అమెరికా యుద్ధాలు చేస్తుందనే అపప్రథ వస్తుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
ఇవి కూడా చదవండి






