కోల్ థామస్ అలెన్ ఎవరు..?
వాషింగ్టన్ వైట్‌హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్లో 31 ఏళ్ల కోల్ థామస్ అలెన్ అనే దుండగుడు ట్రంప్ టార్గెట్ గా తుపాకులతో దాడి చేశాడు. అయితే హిల్టన్ హౌస్ నుంచి లాబీలోకి వెళ్లేందుకు వీలుకాకపోవడంతో….హోటల్ లోకి పరుగులెత్తాడు. కానీ.. వేగంగా స్పందించిన సీక్రెట్ సర్వీసెస్ ఏజెంట్స్.. అతన్ని పట్టుకుని నిందితుడి దగ్గర ఉన్న ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ఆతర్వాత అతని గురించి ఎంక్వైరీ చేసిన సిబ్బంది.. కీలక విషయాలు వెల్లడించారు.
ఇంతకూ సాక్షాత్తూ అమెరికా అధ్యక్షుడిపై గన్ ఎక్కుపెట్టిన 31 ఏళ్ల కోల్ థామస్ అలెన్ ఎవరు..? ఈ వ్యక్తి ఏమీ అల్లరిచిల్లరిగా తిరిగినోడు కాదు.. ఉన్నత విద్యావంతుడు. నాసాలో ఓ మిషన్ కు సంబంధించి శిక్షణ కూడా తీసుకున్నాడు. ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు.అలాంటి వ్యక్తి.. ట్రంప్ ను టార్గెట్ చేశాడు. ట్రంప్ తో పాటు మీటింగ్ లో ఉన్నందుకు .. ఆయన మంత్రివర్గంపైనా కసి పెంచుకున్నాడు.
అంతేకాదు.. నిందితుడు కాల్పులకు తెగబడక ముందు తన లక్ష్యానికి సంబంధించిన వివరాలను కుటుంబ సభ్యులకు పంపించినట్లుగా అధికారులు గుర్తించారు. అందులో అధ్యక్షుడు, ఉన్నతాధికారుల లక్ష్యంగా దాడి చేయబోతున్నట్లుగా సందేశం పంపించాడు. ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాష్ పటేల్ మినహా అధికారులంతా లక్ష్యమని చెప్పాడు.
అయితే అధ్యక్షుడు ట్రంప్‌పై నిందితుడు కీలక వ్యాఖ్యలు చేసినట్లుగా దర్యాప్తు అధికారులు గుర్తించారు. ‘‘ఒక పీడోఫైల్, అత్యాచారి, దేశద్రోహి. ఇకపై నా చేతులు కలుషితం కావడం సహించను’’ అంటూ ట్రంప్‌ను గురించి నిందితుడు రాసినట్లుగా శోధించారు. ఈ వివరాలను ట్రంప్ కు ఓ విలేకరి ఇంటర్వ్యూలో వివరించగా.. ట్రంప్ ఒక్కసారిగా సంయమనం కోల్పోయారు.
తానేమీ రేపిస్ట్‌ను కాదని.. అలాంటి పనులు ఎప్పుడూ చేయలేదని.. ఇక చదవడం ఆపాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్‌స్టీన్ ఫైల్స్‌తో ట్రంప్‌నకు సంబంధం ఉందన్న నేపథ్యంలో ఈ సందర్భం వచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే తనకు ఎప్స్టీన్ ఫైల్స్ సంబంధం లేదని.. ఆ ఆరోపణల నుంచి పూర్తిగా విముక్తి పొందానని ట్రంప్ చెప్పుకొచ్చారు.
ఇక షూటర్ గురించి మాట్లాడుతూ.. ‘‘అతడు రాడికలైజ్ అయ్యాడు. ముందుగా అతడు క్రైస్తవ విశ్వాసి. తర్వాత యాంటీ క్రిస్టియన్‌గా మారాడు. ప్రస్తుతం మానసిక రోగి అయి ఉండొచ్చు.’’ అని పేర్కొ్న్నారు. అమెరికాలో రాజకీయ హింస పెరగడానికి డెమోక్రటిక్ నాయకుల హేట్ స్పీచే కారణమని.. ఇది చాలా ప్రమాదకరమని వ్యాఖ్యానించారు. కాల్పుల సమయంలో తాను భయపడలేదన్నారు. కొద్దిసేపు అక్కడే ఉందామని భద్రతా సిబ్బందికి చెప్పినట్లు తెలిపారు. గత రెండేళ్లలో ఇది మూడో హత్యాయత్నం అని.. మళ్లీ ఈ కార్యక్రమంలో పాల్గొంటానని ట్రంప్ స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి






