Riyadh: సౌదీ ‘వర్క్ వీసా’ రూల్స్ కఠినతరం..
సౌదీ అరేబియాలో ఉద్యోగం చేయాలనుకుంటున్న వారికి కాస్త ఇబ్బందికరమైన పరిణామం చోటు చేసుకుంది.వీసాకు దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు.. తప్పనిసరిగా వృత్తిపరమైన, విద్యా అర్హతలకు సంబంధించి ముందస్తు వెరిఫికేషన్‌ను తప్పనిసరిగా పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ కొత్త నిబంధనలు (Work Visa Rules)నేటి నుంచే అమల్లోకి వచ్చాయి. ఈ మేరకు సౌదీ (Saudi Arabia)లోని భారత దౌత్య కార్యాలయం ఓ సర్క్యులర్‌లో వెల్లడించింది.
‘‘వర్క్ వీసా (Saudi Arabia Work Visa)ల జారీకి ఉన్న తప్పనిసరి నిబంధనల్లో ప్రొఫెషనల్ వెరిఫికేషన్ కూడా చేర్చారు’’ అని భారత ఎంబసీ ఆ సర్క్యులర్‌లో తెలిపింది. ఈ ముందస్తు వెరిఫికేషన్‌ను తప్పనిసరి చేసే అంశాన్ని ఆరు నెలల కిందటే ప్రతిపాదించినట్లు సమాచారం. నాణ్యతా ప్రమాణాలను పాటించడంతో పాటు భారత్ నుంచి వచ్చే కార్మికుల (Indian Workers) సంఖ్యపై నియంత్రణ తీసుకొచ్చేందుకు దీన్నో వ్యూహంగా ఎంచుకున్నట్లు తెలుస్తోంది.
కొత్త నిబంధనల ప్రకారం.. వర్క్ వీసా కోసం దరఖాస్తు చేసుకునేవారంతా తమ విద్యార్హతలను ధ్రువీకరించుకోవాల్సి ఉంటుంది. ప్రవాస ఉద్యోగులు అందించే సర్టిఫికెట్లు, ప్రొఫెషనల్ సమాచారాన్ని సంబంధిత సంస్థల యాజమాన్యాలు, హెచ్ఆర్ విభాగాలు వెరిఫై చేయాలి. అయితే నిజాయతీగా సౌదీ వెళ్లాలనుకుంటున్న వారికి మాత్రం ఇది ఒకరకంగా మంచి పరిణామమని చెప్పొచ్చు. ఎందుకంటే ముందస్తుగానే.. అన్ని చెకింగ్స్ పూర్తికావడంతో, మోసాల నుంచి ఓ రకంగా బయటపడేందుకు ఉపకరిస్తుంది. దీనికి తోడు అన్ని సరిగ్గా ఉంటే.. అక్కడి అధికారుల నుంచి కూడా కాస్త సహకారం దొరికే ఛాన్సు ఉంటుంది.
విదేశీ వ్యవహారాల శాఖ గణాంకాల ప్రకారం.. సౌదీ అరేబియాలో రెండో అత్యధిక ప్రవాస ఉద్యోగులు భారత్ నుంచే ఉన్నారు. 2024 నాటికి సౌదీలో 24లక్షల మందికి పైగా భారతీయ కార్మికులు పనిచేస్తున్నారు. వీరిలో 16.4లక్షల మంది ప్రైవేటు రంగ సంస్థల్లో ఉండగా.. 7.8లక్షల మంది ఇళ్లల్లో వివిధ పనులు చేస్తున్నారు. ఇక, సౌదీలో ప్రవాస ఉద్యోగుల జాబితాలో 26.9లక్షల మందితో బంగ్లాదేశ్ తొలి స్థానంలో ఉంది






