ట్రంప్ తో ఫైట్ కాదు.. యుద్ధానికి వ్యతిరేకమన్న పోప్
వాటికన్,వైట్ హౌస్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు మరింతగా ముదురుతున్నాయి. ట్రంప్ అంటే తనకు భయం లేదని, యుద్ధానికి వ్యతిరేకంగా గళం విప్పడం కొనసాగిస్తానని పోప్ స్పష్టం చేశారు. ఇరాన్‌పై అమెరికా , ఇజ్రాయెల్ జరుపుతున్న దాడులను అన్యాయం, క్రూరమైనవిగా అభివర్ణించారు. ఏ మత సిద్ధాంతం కూడా యుద్ధాన్ని సమర్థించదని ఆయన స్పష్టం చేశారు.
ట్రంప్ ఎన్ని విమర్శలు చేసినా, శాంతి కోసం తన గళాన్ని వినిపిస్తూనే ఉంటానని పోప్ లియో (Pope Leo) చెప్పారు. 10 రోజుల ఆఫ్రికా పర్యటన ప్రారంభంలో భాగంగా అల్జీర్స్‌కు వెళ్తున్న పోప్ విమానంలో రాయిటర్స్‌తో మాట్లాడారు. అయితే తాను ట్రంప్‌తో నేరుగా ఘర్షణకు దిగబోనని, కానీ మత బోధనలను దుర్వినియోగం చేయవద్దని లియో హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విదేశీ విధానాలను పోప్ ఇటీవల తీవ్రంగా విమర్శిస్తున్నారు. ముఖ్యంగా అమెరికా నేతృత్వంలో ఇరాన్‌పై యుద్ధాన్ని పోప్ ఇటీవల విమర్శించిన నేపథ్యంలో వీరి మధ్య వాగ్వాదం జరిగింది. సెయింట్ పీటర్స్ బసిలికాలో జరిగిన ప్రార్థనా కార్యక్రమంలో సంయమనం,శాంతి కోసం పిలుపునిచ్చారు లియో. “సర్వశక్తిమంతులమనే భ్రమ” ఈ యుద్ధానికి కారణం అంటూ ధ్వజమెత్తారు. స్వార్థం, డబ్బుపై ఆరాధన చాలు!”, అధికార ప్రదర్శన చాలు! యుద్ధం చాలు! అని లియో గట్టిగా హెచ్చరించారు.
పోప్ వ్యాఖ్యలపై ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ పోప్‌ను నేరాల విషయంలో బలహీనమైన వ్యక్తి అని, విదేశీ విధానంపై అవగాహన లేని వ్యక్తి అని విమర్శించారు. అంతేకాకుండా, అమెరికా అధ్యక్షుడిని విమర్శించే పోప్ తనకు వద్దు, తాను ఏ పని కోసం అయితే అఖండ మెజారిటీతో ఎన్నికయ్యానో, ఆ పనిని కచ్చితంగా చేస్తున్నానని సోషల్‌మీడియా వేదికగా ట్రంప్ ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే పోప్ లియో ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ వాదోప వాదాలు, ఈ సంఘర్షణ వైట్ హౌస్ , వాటికన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలను స్పష్టం చేస్తున్నాయి.
ఇవి కూడా చదవండి






