అమెరికాకు పాక్ వెన్నుపోటు…?
అమెరికా రక్షణ రంగ నిపుణులు భయపడినంతా జరిగింది. ఇరాన్ వార్ లో ఎక్కడ పాకిస్తాన్ వెన్నుపోటు పొడుస్తుందా అని వారు ఆందోళన చెందారు. అనుకున్నట్లుగానే పాకిస్తాన్ తన డబుల్ గేమ్ ఆడేసింది. ఓవైపు అమెరికా హర్మూజ్ దిగ్భందనంతో ఇరాన్ పై ఆర్థిక ఒత్తిడి తెస్తుంటే.. దానికి చిల్లుపెడుతూ.. తన భూమార్గం ద్వారా తలుపులు బార్లా తెరిచింది. ఇంకేముంది ఇరాన్ నుంచి చమురు నేరుగా పాక్ భూభాగం ద్వాారా కావాల్సిన దేశాలకు చేరనుంది.
హర్మూజ్ జలసంధి మీదుగా ఇరాన్ సముద్ర వాణిజ్యాన్ని దిగ్బంధించి, ఆ దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయాలన్నది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యూహం. దీనిని “గరిష్ఠ ఆర్థిక ఒత్తిడి” (maximum economic pressure) విధానంగా ఆయన అభివర్ణిస్తున్నారు. అయితే, పాకిస్థాన్ తాజా నిర్ణయంతో ఇరాన్ తన వాణిజ్యాన్ని, ముఖ్యంగా రష్యా, చైనాలతో లావాదేవీలను ఈ భూమార్గాలు ద్వారా నిరాటంకంగా కొనసాగించే అవకాశం లభించింది. దీంతో ట్రంప్ వ్యూహానికి పెద్ద గండి పడినట్లయింది.
ఈ పరిణామంపై అమెరికా జాతీయ భద్రతా నిపుణుడు డెరెక్ జె గ్రాస్మన్ తీవ్రంగా స్పందించారు. “ట్రంప్ ప్రభుత్వానికి ఇది కొత్త సమస్య. మీకు మిత్రుడైన పాకిస్థాన్, ఇరాన్‌కు ఆరు భూమార్గాలను తెరవడం హర్మూజ్ జలసంధిలో మీరు ఏర్పాటు చేసిన దిగ్బంధనాన్ని బలహీనపరిచింది. అమెరికా ఒత్తిడిని తట్టుకోవడానికి ఇది ఇరాన్‌కు సహాయపడుతుంది. ఇస్లామాబాద్ మరోసారి అమెరికాతో డబుల్ గేమ్ ఆడింది” అని ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేశారు. డాన్ పత్రిక కథనం ప్రకారం ఇప్పటికే పాక్ ఓడరేవుల్లో ఇరాన్ వెళ్లాల్సిన సుమారు 3,000 కార్గో కంటైనర్లు నిలిచిపోయాయి. తాజా నిర్ణయంతో అవన్నీ ఈ భూమార్గాల ద్వారా ఇరాన్‌కు చేరనున్నాయి.
కేవలం అమెరికా మాత్రమే కాదు, పాకిస్థాన్ మధ్యవర్తిత్వ పాత్రపై ఇతర దేశాలు కూడా సందేహాలు వ్యక్తం చేస్తున్నాయి. పాకిస్థాన్ నమ్మదగిన మధ్యవర్తి కాదని భారత్‌లో ఇజ్రాయెల్ రాయబారి రువెన్ అజార్ ఇటీవల వ్యాఖ్యానించారు. ఆసక్తికరంగా పాకిస్థాన్ సహాయం పొందుతున్న ఇరాన్ కూడా దాని నిష్పాక్షికతను శంకించడం గమనార్హం. పాక్ తమకు మంచి మిత్రుడే అయినప్పటికీ, అది అమెరికా ప్రయోజనాలకు అనుకూలంగా వ్యవహరిస్తుందని, అందువల్ల సరైన మధ్యవర్తి కాదని ఇరాన్ జాతీయ భద్రతా కమిషన్ ప్రతినిధి ఇబ్రహీం రెజాయీ పేర్కొన్నారు. ఈ పరిణామాలతో పాకిస్థాన్ దౌత్యపరమైన విశ్వసనీయత ప్రశ్నార్థకంగా మారింది.
ఇవి కూడా చదవండి






