Poland: మాతో పెట్టుకుంటే వినాశనమే… రష్యాకు నాటో సూటి వార్నింగ్…
మొన్నటివరకూ అమెరికా-నాటో దళాలు కలసికట్టుగా సాగాయి. దీంతో అటువైపు చూడాలన్నా మిగిలిన దేశాలు భయపడే పరిస్థితి ఉండేది. అయితే ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఎంతలా అంటే.. అమెరికా వేరు, నాటో వేరన్న స్థాయికి చేరాయి. ఈ పరిస్థితుల్లో అమెరికా, పుతిన్(putin) కలిసి సాగుతోందన్న అభిప్రాయం .. మిగిలిన యూరోప్ దేశాల్లో వ్యక్తమవుతోంది. బైడెన్ సమయంలో అమెరికా వేరు.. ఇప్పుడు ఉన్న అమెరికా వేరన్న కెనడా మాజీ అధ్యక్షుడు ట్రూడో వ్యాఖ్యలు సైతం.. యూరోపియన్ యూనియన్ దేశాల మదిలో మెదులుతోంది.
దీనికి తోడు ఉక్రెయిన్ యుద్ధం విషయంలో విషయంలో ట్రంప్.. పుతిన్ కు అనుకూలంగా ప్రవర్తిస్తున్నారన్న అభిప్రాయంలో ఉన్నాయి యూరోపియన్ దేశాలు. దీంతో తమకు వ్యతిరేకంగా ఎలాంటి పరిణామాలు తలెత్తుతాయో అన్న భయం ఆయాదేశాల ప్రతినిధుల్లో వ్యక్తమవుతోంది. ఈసందర్భంగా రష్యా (Russia)ను ఉద్దేశించి నాటో (NATO) సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టే తీవ్ర హెచ్చరికలు చేశారు. తమ కూటమిలోని పోలాండ్ లేదా మరేదైనా దేశం జోలికొస్తే వినాశకర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. పుతిన్ (Vladimir Putin) అయినా, మరెవరైనా సరే.. తాము ఏదైనా సాధించగలమని అనుకుంటే పొరపాటే అవుతుందన్నారు. ఉక్రెయిన్ యుద్ధం ముగింపు విషయంలో అమెరికా- రష్యాల మధ్య సాగుతున్న చర్చల్లో మాస్కోదే పైచేయిగా నిలిచే అవకాశం ఉందనే వార్తల నడుమ రుట్టే వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
‘‘పోలాండ్, ఇతర సభ్యదేశాల భద్రతకు నాటో కట్టుబడి ఉంది. మాపై దాడి చేసి తప్పించుకోగలమని ఎవరైనా అనుకుంటే అది తప్పిదమే అవుతుంది. అటువంటి వారిపై పూర్తిస్థాయిలో విరుచుకుపడతాం. మా ప్రతిచర్యతో వినాశకర పరిణామాలు తప్పవు. పుతిన్‌తోపాటు మాపై దాడి చేయాలనే ఉద్దేశం ఉన్న ఇతరులకూ ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నా’’ అని పోలాండ్ పర్యటనలో భాగంగా రుట్టే వ్యాఖ్యానించారు. పోలాండ్ ప్రధాని డొనాల్డ్ టస్క్ మాట్లాడుతూ.. అమెరికా- రష్యాల చర్చల ఫలితాలు ఏ విధంగా వచ్చినా.. వాటికి సిద్ధంగా ఉండటం ముఖ్యమని చెప్పారు.
ఉక్రెయిన్ యుద్ధం విషయంలో రష్యా, అమెరికాల చర్చల్లో పుతిన్‌కు అనుకూల ఫలితం వస్తుందేమోనని ఐరోపా దేశాల్లో ఆందోళన నెలకొని ఉంది. మాస్కో తన సైన్యాన్ని తిరిగి బలోపేతం చేసేందుకు, రాబోయే సంవత్సరాల్లో ఈ ప్రాంతంలోని ఇతర దేశాలను బెదిరించేందుకు ఇది అవకాశం కల్పిస్తుందేమోనని భావిస్తున్నాయి. ముఖ్యంగా పోలాండ్, ఎస్తోనియా, లిథువేనియా, లాత్వియాలు కలవరపడుతున్నాయి.






