NASA: సునీత విలియమ్స్ ప్రాణాలతో నాసా చెలగాటం..?
అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా.. సునీత విలియమ్స్ ప్రాణాలను రిస్కులో పెట్టిందా..? భద్రతా పరమైన హెచ్చరికలను పక్కనపెట్టి మరీ .. నాటి నాసా మేనేజ్ మెంట్ .. బోయింగ్ మిషన్ పై ముందుకెళ్లిందా..? ఇది కల్పనాచావ్లా మృత్యు ఉదంతానికి దగ్గరగా ఉందా..? అయితే అదృష్టవ శాత్తూ సునీత బయటపడిందా..? అంటే అవుననే సమాధానమిస్తోంది నాసా నివేదిక. సునీత మిషన్ ప్రాణాంతక వైఫల్యమేనని తేల్చింది. ఈ పరిణామం అంతర్జాతీయంగా తీవ్ర చర్చనీయాంశమైంది.
వ్యోమగాములు సునీతా విలియమ్స్ (Sunita Williams), బుచ్ విల్మోర్ ప్రయాణించిన బోయింగ్ స్టార్‌లైనర్ మిషన్‌పై నాసా 311 పేజీల నివేదిక విడుదల చేసింది. ఈ సందర్భంగా నాసా చీఫ్ జేర్డ్ ఐజాక్‌మ్యాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. భద్రతాపరమైన హెచ్చరికలను విస్మరించి నాటి నాసా మేనేజ్మెంట్, బోయింగ్ మిషన్‌పై ముందుకెళ్లారని వెల్లడించారు. ‘‘2024 జూన్‌లో ఈ మిషన్‌ను ప్రయోగించిన వెంటనే సమస్య మొదలైంది. రాకెట్‌కు థ్రస్ట్‌ను ఉత్పత్తి చేసే స్పేస్‌క్రాఫ్ట్ ప్రొపల్షన్ వ్యవస్థ విఫలమవడం ప్రారంభించింది. స్పేస్ స్టేషన్‌కు సమీపిస్తుండగానే ఐదు థ్రస్టర్లు పనిచేయడం ఆగిపోయాయి. దీనికితోడు హీలియం లీకేజీ మరింత భయపెట్టింది. అయితే, అదృష్టవశాత్తూ డాకింగ్ సురక్షితంగా పూర్తవడంతో వ్యోమగాములు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి వెళ్లగలిగారు’’ అని ఈ నివేదికలో వెల్లడించారు. భద్రతాపరమైన ప్రొటోకాల్స్‌ను పక్కనబెట్టి ప్రయోగాన్ని అనుకున్న షెడ్యూల్‌కు చేపట్టేలా నాసా మేనేజర్లపై ఒత్తిడి తెచ్చినట్లు దర్యాప్తులో గుర్తించారు. ఈ మిషన్‌ను టైప్-ఏ వైఫల్యంగా ధ్రువీకరించడంతో వ్యోమగాముల ప్రాణాలను పణంగా పెట్టి ప్రయోగం చేపట్టామని నాసా అంగీకరించినట్లయ్యింది.
టైప్-ఏ ప్రమాదం..?
ఈ మిషన్‌ను నాసా ‘టైప్-ఏ’ ప్రమాదంగా ప్రకటించడం ఏరోస్పేస్ ఇండస్ట్రీని షాక్‌కు గురిచేసింది. సాధారణంగా అత్యంత విపత్కర యాక్సిడెంట్లకు దీన్ని పేర్కొంటారు. 2003లో జరిగిన కొలంబియా షటిల్ డిజాస్టర్‌ను ‘టైప్-ఏ’ ప్రమాదంగా పిలుస్తారు. ఆ ప్రమాదంలోనే భారత అమెరికన్ వ్యోమగామి కల్పనా చావ్లా సహా మరో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. అప్పుడు కూడా ఇంజినీర్ల ఆందోళనలను పట్టించుకోకుండా మిషన్‌ను ప్రయోగించడంతో ఆ విషాదం చోటుచేసుకుంది.
గతేడాది జూన్ 5న ప్రయోగించిన బోయింగ్ వ్యోమనౌక ‘స్టార్‌లైనర్’లో (Starliner) సునీత, విల్మోర్లు ఐఎస్ఎస్కు వెళ్లారు. ప్రణాళిక ప్రకారం వీరు 8 రోజులకే భూమిని చేరుకోవాల్సి ఉంది. అయితే, స్టార్‌లైనర్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వ్యోమగాములు లేకుండానే అది భూమికి తిరిగొచ్చింది. అనంతరం వీరిని తీసుకొచ్చేందుకు బోయింగ్ అనేక ప్రయత్నాలు చేసింది. చివరకు తొమ్మిది నెలల తర్వాత 2025 మార్చిలో వీరిద్దరూ సురక్షితంగా భూమిని చేరుకున్నారు.

















