India: మయన్మార్ సరిహద్దుల్లో కొత్తదేశంతో భారత్కు లాభమేనా?
ప్రత్యేక దేశం కోసం పోరాడుతున్న అరకాన్ ఆర్మీ.. అక్కడున్న బలమైన సైనిక తిరుగుబాటుదారుల్లో ఒకటి. దీనికి అత్యాధునిక ఆయుధాలు సైతం మెండుగా ఉన్నట్లు నిఘా వర్గాలు వెల్లడిస్తున్నాయి. అయితే.. ప్రస్తుత పరిణామాల్లో అరకాన్ ఆర్మీ(arakan army) ఆశిస్తున్నట్లుగా ప్రత్యేక రఖైన్ దేశం ఏర్పాటు అయితే… దానికి భారత్ మద్దతు కచ్చితంగా కావాల్సి వస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. లేదంటే.. చుట్టూ ఉన్న సంఘర్షణల్లో ఎక్కువ కాలం మనుగడ సాధించలేదు.
మయన్మార్ లో సైనిక, ప్రజా ప్రభుత్వాల మధ్య ఘర్షణ, అంతర్యుద్ధంతో అక్కడి చిన్-కుకీ తెగలు భారత్లోని మిజోరం, మణిపుర్లకు శరణార్థులుగా వచ్చారు. వారిలో.. 70 వేల మంది కుకీలు…మిజోరంలో ఆశ్రయం పొందుతున్నారు. ప్రస్తుతం ఈశాన్య రాష్ట్రాల్లో చెలరేగిన అల్లర్లల్లో కుకీల పాత్ర ఉంది. అయితే.. అరకాన్ ఆర్మీ, దాని మిత్రపక్ష తిరుగుబాటు దళాలకు కుకీలతో వ్యతిరేకత ఉంది. దీంతో.. ప్రస్తుతం చిన్ ప్రాంతంపై అరకాన్ ఆర్మీ నేతృత్వంలోని.. సీబీఏ తిరుగుబాటుదారులకి ఆధిపత్యం లభించడం భారత్కు కలిసొచ్చే అంశమేనని చెప్పొచ్చు. ఎందుకంటే.. మన దగ్గరకు వచ్చి విద్వేషాలకు, హింసాత్మక కార్యకలాపాలకు పాల్పడుతున్న కుకీలను వెనక్కి పంపేందుకు సీబీఏ సహకరించే అవకాశం ఉంటుంది. ఇప్పటికే.. భారత్ వర్గాలు.. సీబీఏతో సంప్రదింపులు జరుపుతున్నట్లు అంతర్జాతీయ నిఘా సంస్థలు అంచనా వేస్తున్నాయి.
చైనా వైఖరేంటి?
బర్మాలో సైనిక కూటమి ఉంటేనే.. తన బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్టు(బీఆర్ఐ) ప్రాజెక్టుకు కలిసి వస్తుందని చైనా భావిస్తోంది. దీంతో పాటు మరికొన్ని కీలక ప్రాజెక్టుల్ని చైనా బర్మాలో మొదలుపెట్టింది. వీటిలో చాలా వరకూ రఖైన్ ప్రాంతంలో కూడా ఉన్నాయి. ఇప్పుడు అక్కడ తిరుగుబాటు దారులు పైచేయి సాధిస్తే.. డ్రాగన్ పప్పులు ఉడకవు. పైగా.. వందల కోట్ల డాలర్లు పెట్టుబడి పెట్టి నిర్మిస్తున్న ప్రాజెక్టులు మూలనపడాల్సి వస్తుందని దాని భయం. ఇందుకోసమే.. తన సరిహద్దుల నుంచి బర్మా సైనిక ప్రభుత్వం పై పోరాడుతున్నతిరుగుబాటుదారులకు సాయం చేస్తోందనే ఆరోపణలున్నాయి.
భారత్ కు కలిసొచ్చే అంశాలేంటి..
మణిపూర్ నుంచి కుకీలను తిరిగి తరలించడంతో పాటు అనేక అంశాల్లో కలిసి రావాలంటే.. బర్మా తిరుగుబాటు దారుల వశం కావాల్సి ఉంటుంది. ప్రస్తుత సైనిక ప్రభుత్వం.. అక్కడి మైనార్టీలు, బౌద్ధులు, హిందువులపై తీవ్రంగా దాడులు చేస్తూ హింసిస్తున్నాయి.,అక్కడి క్రూరమైన జైళ్లల్లో నిర్భందిస్తూ.. చిత్ర హింసలకు గురిచేస్తున్నాయి. ఈ తరుణంలో.. అన్ని వర్గాల వారికి అనుకూలంగా ఉండడం.. సరిహద్దుల్లో శాంతియుత వాతావరణం ఉండాలంటే.. త్రీ బ్రదర్హుడ్ అలయన్స్ అధికారంలోకి రావడమో.. ప్రత్యేక దేశాన్ని సాధించడమో జరగాలని ఆశిస్తున్నారు. అదే జరిగితే.. భారత్ పూర్తి సహాయ సహకారాలు అందించవచ్చని భావిస్తున్నారు.
అంతే కాదు.. ఒకవేళ భారత సరిహద్దుల్లో ప్రత్యేక దేశం ఏర్పడితే.. భారత్ పై కచ్చితంగా ఆధారపడాల్సిన పరిస్థితుల్లో మనకు అనుకూలంగానే మసులుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి.. మనకు భద్రత పరంగా పెద్దగా ఇబ్బందులు వచ్చే అవకాశాలు లేవని అంటున్నారు. అలాగే.. ఆయా ప్రాంతాల్లో మొదలుపెట్టిన కోట్ల విలువైన ప్రాజెక్టుల్లో మళ్లీ కదలిక వస్తుందని భావిస్తున్నారు. ముఖ్యంగా.. మన ఈశాన్య రాష్ట్రాలకు సరకులు, ఇతర కనెక్టివిటీ కోసం చికెన్ నెక్ అనే ప్రాంతం దగ్గర బంగ్లాదేశ్ భూభాగం గుండా రాకపోకలు సాగించాల్సి వస్తుంది. అదే బర్మాలో ప్రత్యేక దేశం ఏర్పడితే.. ఆ ప్రాంతం గుండా ఈశాన్య రాష్ట్రాలకు సులువుగా చేరే వీలుంటుందన అంటున్నారు. కాబట్టే.. భారత పాలకులు బర్మాలోని సైనిక కూటమి ప్రభుత్వానికి మద్ధతు ఉపసంహరించుకుని.. తిరుగుబాటుదారుల కూటమికి మద్ధతు ప్రకటించడం వారికి, మనకి ఉపయోగకరమని విశ్లేషిస్తున్నారు.






