Arakan army : భారత్ – మయన్మార్ మధ్య మరో కొత్తదేశం..?
ఈశాన్య సరిహద్దుల్లో ఉన్న మయన్మార్‌లో ప్రస్తుతం అరాచక పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా అక్కడి జుంటా సర్కార్ పై రెబల్స్ విజయాలు సాధిస్తున్నారు. దీంతో భారత్ సరిహద్దుల్లో మరో దేశం అవిర్భవిస్తుందా.. అనే ఊహగానాలు వ్యక్తం అవుతున్నాయి. అదే నిజమైతే.. భారత్ పై ఎలాంటి ప్రభావం పడనుంది.
బర్మాగా పిలిచే మయన్మార్ లో పరిస్థితుల్ని భారత్ ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలిస్తుంది. కాగా.. ఇటీవల ఆ దేశంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. బర్మా నుంచి భారత్‌కు వెళ్లే ప్రధాన మార్గాల్లో ఉన్న ముఖ్య పట్టణాన్ని జుంటా సైన్యం నుంచి పూర్తిగా ఆధీనంలోకి తీసుకున్నట్లు అరకాన్ ఆర్మీ(Arakan army) ప్రకటించింది. అక్కడి చిన్ రాష్ట్రంలోని పలెట్వాను తమ నియంత్రణలోకి తీసుకున్నామని అరకాన్ అర్మీ స్పష్టం చేసింది. ఈ పట్టణం భారత సరిహద్దుకు చాలా దగ్గరగా ఉంటుంది. ఇది.. కీలక ప్రాంతం కావడంతో ఈ పరిణామాలను భారత్ చాలా జాగ్రత్తగా, నిశితంగా పరిశీలిస్తోంది. అరకాన్ సైన్యం రఖైన్ రాష్ట్రంలోని 18 ప్రావిన్సులలో 15 ప్రావిన్సులను ఇప్పటికే స్వాధీనం చేసుకోగా, మరిన్ని ప్రాంతాలను స్వాధీనంలోకి తీసుకునేందుకు ముందుకు సాగుతోంది.
సైన్యం పై అరకాన్ ఆర్మీ తిరుగుబాటు
మయన్మార్‌లోని అరకాన్ ఆర్మి గురించి ఇప్పుడు భారత్ లో ఎక్కువగా చర్చ జరుగుతుంది. ఇది రాఖైన్ రాష్ట్రంలోని రాఖైన్ అనే జాతి ప్రజల కోసం ఏర్పడిన తిరుగుబాటుదారులున్న గ్రూప్. వీరు బౌద్ధాన్ని ఎక్కువగా పాటిస్తుంటారు. దాంతో.. తమకు మయన్మార్ నుంచి ప్రత్యేక ప్రతిపత్తి కావాలని, వీలైతే ప్రత్యేక దేశం కావాలని కోరుకుంటున్నారు. ఇందుకోసం.. సైనిక తిరుగుబాటును మార్గంగా ఎంచుకుని జుంటా సైన్యంపై పోరాడుతున్నారు. ఈ కారణంగానే.. ఈ అరకాన్ ఆర్మీని బర్మా సైనిక ప్రభుత్వం ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. అయితే.. ప్రస్తుతం బర్మాలోని సైన్యంపై .. ఎంఎన్డీఏఏ, టీఎన్‌ఎల్‌ఏ వంటి మరికొన్ని గ్రూపులు అక్కడి సైనిక ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నాయి. ఈ మూడు గ్రూపులను త్రీ బ్రదర్హుడ్ అలయన్స్ అని పిలుస్తారు. ఇవి 2023 నుంచి సైన్యంపై పోరాడుతున్నాయి.
బంగాళాఖాతాన్ని ఆనుకుని ఉన్న రఖైన్ ప్రాంతంలో మయన్మార్ సైన్యాన్ని అరకాన్ ఆర్మీ ఎదుర్కొంటోంది. రఖైన్, చిన్ ప్రాంతాలు మిజోరం, మణిపుర్ రాష్ట్రాలతో సరిహద్దు కలిగి ఉన్నాయి. ఈ రెండు చోట్ల మయన్మార్ సైన్యం అతిత్వరలో ఖాళీచేయక తప్పదని అంచనా. అంతకుముందు, రఖైన్(Rakhine) రాష్ట్రంలోని ఆన్ పట్టణంలో అధికారంలోని జుంటా దళాలకు చెందిన సభ్యులు లొంగిపోతున్నట్లు ఉన్న వీడియో ఫుటేజీని మయన్మార్ తిరుగుబాటుదారు దళాలైన అరకాన్ ఆర్మీ విడుదల చేసింది.
భారత ఆర్మీ చర్యలు..
మయన్మార్ కు భారత్ లోని మిజోరాం రాష్ట్రంతో సుదీర్ఘ సరిహద్దు ఉంది. దాదాపు 510 కిలోమీటర్ల పొడవైన మిజోరాం ఈ సరిహద్దు వెంబడి.. రక్షణ చర్యలను భారత్ పటిష్టం చేస్తోంది. అలాగే.. కంచె లేని అంతర్జాతీయ సరిహద్దుకు రెండు వైపుల ప్రజల కదలికలను పరిశీలిస్తున్నామని, వీలైంత మేరకు నియంత్రిస్తున్నామని భారత సైనికాధికారులు వెల్లడించారు. ఇరువైపుల 10 కిలోమీటర్ల లోపు ప్రజల సైన్యం అనుమతి లేకుండా సరిహద్దులు దాటకుండా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఇరుదేశాల నివాసితులు ఒకరినొకరు సందర్శించుకోవడానికి ఇప్పుడు సరిహద్దు పాస్ కచ్చితంగా కావాల్సిందేనని సైనిక అధికారులు చెబుతున్నారు.
సరిహద్దుల్లో ఎన్నో తరాలుగా ప్రజల మధ్య సత్సంబంధాలు ఉండడంతో.. వారి రాకపోకల్ని పూర్తిగా నియంత్రించేందుకు వీలుండదు. ఈ కారణంగానే.. అంతర్జాతీయ సరిహద్దుకు ఇరువైపులా 10 కిలోమీటర్ల ప్రాదేశిక పరిమితిలో నివసిస్తున్నారని ధృవపరిచే పత్రాలు ఉంటే.. వారికి 7 రోజులకు చెల్లుబాటు అయ్యేలా ప్రత్యేక పాస్ అందిస్తున్నారు.






