Kishan Reddy: బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి..!?

రాజకీయాల్లో కమిట్మెంట్ చాలా ముఖ్యం. పార్టీకి, ప్రజలకు కమిట్మెంట్ తో పనిచేస్తూ పోతే పదవులు వాటంతట అవే వస్తాయని చెప్పుకుంటూ ఉంటారు. అయితే ఇప్పుడు అలాంటి కమిట్మెంట్ ఉన్న రాజకీయ నాయకులు చాలా తక్కువ. అలాంటి అరుదైన నేతల్లో ఒకరు కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి (G Kishan Reddy). సుదీర్ఘకాలం భారతీయ జనతాపార్టీలో (BJP) ఉంటూ అంచలంచెలుగా ఎదిగారాయన. పార్టీపట్ల ఆయన అంకితభావాన్ని గుర్తించిన పెద్దలు అనేక పదవులు కట్టబెడుతూ వచ్చారు. ఇప్పుడు ఆయన జాతీయ అధ్యక్ష పదవి రేసులో ఉన్నారనే టాక్ వినిపిస్తోంది.
కిషన్ రెడ్డి తెలంగాణ (Telangana) రాష్ట్రానికి చెందిన బీజేపీ కీలక నేత. 1977లో జనతాపార్టీలో (Janatha Party) అడుగుపెట్టిన ఆయన 1980లో బీజేపీలోకి ప్రవేశించారు. అప్పటి నుంచి ఆయన బీజేపీకోసమే పనిచేస్తున్నారు. అనేక కీలక పదవులు చేపట్టారు. జిల్లా నుంచి రాష్ట్ర స్థాయి అధ్యక్ష పదవిని పలుమార్లు అలంకరించారు. జాతీయ స్థాయిలో యువమోర్చా అధ్యక్షుడిగా, పార్టీ ఉపాధ్యక్షుడిగా, కోశాధికారిగా కూడా బాధ్యతలు చేపట్టారు. అంబర్ పేట్ (Amberpet) నియోజకవర్గం నుంచి పలుమార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గత రెండు సార్లు సికింద్రాబాద్ (Secunderabad) నుంచి ఎంపీగా విజయం సాధించారు.
ప్రధాని మోదీతో (PM Modi) కిషన్ రెడ్డికి అత్యంత సన్నిహిత సంబంధాలున్నాయి. అందుకే ఆయన్ను 2019లోనే తన మంత్రివర్గంలోకి తీసుకున్నారు. అప్పడు సహాయమంత్రిగా ఉన్న ఆయనకు 2024 ఎన్నికల తర్వాత కేబినెట్ ర్యాంక్ (Central Minister) వరించింది. అదే సమయంలో రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా కిషన్ రెడ్డి ఉన్నారు. అయితే కిషన్ రెడ్డికి మరో ప్రమోషన్ ఇవ్వాలనే ఆలోచనలో జాతీయ నాయకత్వం ఉన్నట్టు తెలుస్తోంది. సుదీర్ఘకాలం పార్టీకి సేవలందిస్తున్న కిషన్ రెడ్డిని జాతీయ అధ్యక్షుడిని చేస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నట్టు సమాచారం. ప్రస్తుత అధ్యక్షుడు జె.పి.నడ్డా (JP Nadda) పదవీకాలం గతేడాదే ముగిసింది. అయితే సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా ఈ ఏడాది జూన్ వరకూ పొడిగించారు. అది కూడా మూగియడంతో డిసెంబర్ లోపు కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలని హైకమాండ్ నిర్ణయించింది.
పదేళ్లుగా బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది. వరుసగా మూడోసారి కూడా గెలిచింది. ఈసారి జమిలి ఎన్నికలకు (Duel Elections ) వెళ్లాలనుకుంటోంది. ఉత్తరాదిపై (North India) మంచి పట్టున్న బీజేపీకి దక్షిణాదిలో (South India) మాత్రం ఇంకా పట్టు చిక్కట్లేదు. అందుకే ఈసారి దక్షిణాదికి చెందిన వ్యక్తికి జాతీయ అధ్యక్ష బాధ్యతలు ఇస్తే బాగుంటుందనే ఆలోచనలో హైకమాండ్ ఉన్నట్టు సమాచారం. అందుకే రేసులో కిషన్ రెడ్డి ముందున్నారు. కిషన్ రెడ్డితో పాటు ధర్మేంధ్ర ప్రధాన్, దేవేంద్ర ఫడ్నవీస్, శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్లు కూడా ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అయితే వీళ్లందిరి కంటే కిషన్ రెడ్డే రేసులో ముందున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ కిషన్ రెడ్డికి ఈ పదవి దక్కితే వెంకయ్య నాయుడు తర్వాత ఆ హోదా దక్కించుకున్న వ్యక్తిగా చరిత్ర సృష్టిస్తారు.