Italy: మస్క్ కు ఇటలీ ప్రధాని బాసట.. ఈయూలో విభేదాలు బట్టబయలు..
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ (Elon Musk) తమ దేశ రాజకీయాల్లో జోక్యం చేసుకుంటున్నారని నార్వే, బ్రిటన్, ఫ్రాన్స్ దేశాధినేతలు ఇటీవల తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. తాజాగా ఈవిషయంపై ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ (Meloni) స్పందించారు. మస్క్ లెఫ్ట్ వింగ్ కాకపోవడం వల్లే ఆ దేశాలన్నీ ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయన్నారు. .
ఎలాన్ మస్క్ తన భావ ప్రకటనా స్వేచ్ఛను వినియోగించుకుంటున్నారని.. అమెరికాలోని బిలియనీర్ జార్జ్ సోరోస్ (George Soros) లాంటి లెఫ్ట్‌వింగ్ మద్దతుదారులే రాజకీయ జోక్యానికి పాల్పడ్డారని విమర్శించారు.‘‘సంపన్నులు తమ దగ్గరున్న సంపద, వనరులను ప్రపంచవ్యాప్తంగా ఉన్న పార్టీలు, సంఘాలు, రాజకీయ ప్రతినిధులకు విరాళంగా ఇస్తూ అక్కడి పరిస్థితులను ప్రభావితం చేయడం వల్ల సమస్యలు వస్తాయి. బిలియనీర్ జార్జ్ సోరోస్ ఈవిధంగా వ్యవహరిస్తారు. కానీ మస్క్ అలా చేయట్లేదు. వివిధ దేశాలలోని పలు పార్టీలకు ఎన్నికల ప్రచార ఖర్చుల కోసం ఆర్థికసహాయం చేస్తున్నారు. ఇది చాలా సాధారణమైన విషయం’’ అని మెలోనీ అన్నారు.
కొన్ని దేశాల అధినేతలు సోరోస్ నుంచి డబ్బు తీసుకొని.. ఆయనకు మద్దతుగా వ్యవహరిస్తుంటారని అన్నారు. కానీ తాము మస్క్ నుంచి ఎటువంటి ఆర్థికసహాయం పొందలేదని అన్నారు. మస్క్ కంపెనీ స్పేస్ఎక్స్తో తమ ప్రభుత్వం వివాదాస్పద సైబర్ సెక్యూరిటీ డీల్‌పై సంతకం చేయబోతున్నట్లు వచ్చిన మీడియా కథనాలను ఆమె ఖండించారు.
కొన్ని నెలల నుంచి మస్క్‌కు, ప్రపంచ నేతలకు మధ్య వివాదాలు ఏర్పడుతున్నాయి. జర్మనీ ఛాన్సలర్ ఓలాఫ్ షోల్జ్, కెనడా ప్రధాని ట్రూడో, అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ వంటి వారితో మాటల యుద్ధాలకు దిగారు. ఇటీవల కాలంలో మస్క్ బ్రిటన్ రాజకీయాల గురించి ఎక్కువగా స్పందిస్తున్నారు. అక్కడి ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ.. విపక్షం రీఫామ్యూకేకు మద్దతు తెలుపుతున్నారు. ఆ పార్టీకి భారీగా విరాళం ఇచ్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తోందన్నారు. మరోవైపు తమ దేశ ఎన్నికల్లో టెస్లా అధినేత నేరుగా జోక్యం చేసుకొంటున్నాడని ఫ్రాన్స్ అధినేత మేక్రాన్, కెనడా ప్రధాని ట్రూడో, యూకే పీఎం స్టార్మర్, నార్వే ప్రధాని జోనాస్ ఆరోపించారు.






