మా జోలికొస్తే.. గల్ఫ్ మునుగుద్ది.. అమెరికాకు ఇరాన్ వార్నింగ్..!
చర్చల ప్రక్రియ విఫలం కావడంతో ఆగ్రహంతో ఉన్న పెద్దన్న అమెరికా…. తన అమ్ములపొదిలో ఉన్న మరో అస్త్రాన్ని సంధించేందుకు సిద్ధమైంది. దీనిలో భాగంగా హర్మూజ్ జలసంధిని దిగ్భందిస్తామని ఇరాన్ నౌకలు కదలకుండా చేస్తామని హెచ్చరించింది. అయితే ఈహెచ్చరికలపై టెహ్రాన్ అంతేఘాటుగా స్పందించింది.అంతర్జాతీయ జలాల్లో నౌకల రాకపోకలపై ఆంక్షలు విధించడం ‘సముద్రపు దొంగతనం’తో సమానమని ఐఆర్జీసీ (IRGC) పేర్కొంది. తమ భద్రతకు ముప్పు వాటిల్లితే పర్షియన్ గల్ఫ్ ప్రాంతమంతటా సముద్ర భద్రత ప్రమాదంలో పడుతుందని హెచ్చరించింది. అమెరికా తమ రేవులను దిగ్బంధిస్తే.. తాము గల్ఫ్ రేవులను మూసివేస్తామనింది. భద్రత ఉంటే అందరికీ ఉండాలని.. లేకపోతే ఎవరికీ ఉండకూడదని ఐఆర్జీసీ పేర్కొంది.
హర్మూజ్ జలాల్లో భద్రతను పర్యవేక్షిస్తామని ఐఆర్జీసీ పేర్కొంది. తమ ఓడరేవులకు ముప్పు కలిగితే ఈ ప్రాంతంలో ఏ ఓడరేవూ సురక్షితంగా ఉండదని వెల్లడించింది. శత్రు దేశాల నౌకలను జలసంధి గుండా వెళ్ళడానికి అనుమతించబోమని స్పష్టం చేసింది. ఇరాన్ (Iran) అనుమతి పొందిన నౌకలకు మాత్రమే హర్మూజ్‌లోకి ప్రవేశించే వీలు కల్పిస్తామంది. హర్మూజ్‌పై నియంత్రణ కొనసాగించడానికి ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది.
హర్మూజ్ జలసంధి (Strait of Hormuz)ని దిగ్బంధిస్తామని అమెరికా చేసిన ప్రకటనపై… భారత్‌లోని ఇరాన్ రాయబారి మహమ్మద్ ఫత్హలీ (Iran envoy Mohammad Fathali) కీలక వ్యాఖ్యలు చేశారు.జలసంధి ఇరాన్ ప్రాదేశిక జలాల్లోనే ఉందని..ఆ జలాలపై తమ హక్కులను కాపాడుకుంటామన్నారు. ఇరాన్ ఏ విధంగా శాంతి చర్చలకు కట్టుబడి ఉందో.. అదే విధంగాసైనిక చర్యలకు కూడా సిద్ధంగా ఉందన్నారు. టెహ్రాన్ శక్తి ఏమిటో అమెరికాకు తెలుసని వ్యాఖ్యానించారు.
దేశ ప్రజలు, జాతీయ ప్రయోజనాల పరిరక్షణ కోసం.. తమ ప్రతినిధి బృందం అమెరికా బృందంతో 21 గంటల పాటు చర్చలు జరిపిందని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా అణు సమస్యలు, యుద్ధ నష్టపరిహారం, ఆంక్షల ఉపశమనం వంటి మూడు డిమాండ్లను తమ బృందం వారి ముందు ఉంచిందని.. అందుకు అగ్రరాజ్యం ఒప్పుకోకపోవడంతో చర్చలు విఫలమయ్యాయని తెలిపారు.
ఇవి కూడా చదవండి






