గల్ఫ్ దేశాలు, ఇరాన్ మధ్య సీక్రెట్ ఫైట్…?
పశ్చిమాసియా పరిస్థితి నివురుగప్పిన నిప్పులానే ఉంది. పశ్చిమాసియాలో తన ప్రభావాన్నిచూపిస్తున్న ఇరాన్.. తమపైదాడులు చేయడాన్ని గల్ఫ్ దేశాలు జీర్ణించుకోలేకపోతున్నాయి. ముఖ్యంగా కువైట్ కుచెందిన ఓదీవిని ఇరాన్ ఆక్రమించేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది.కువైట్ (Kuwait) అంతర్గత వ్యవహారాల మంత్రిత్వశాఖ చేసిన ప్రకటన గల్ఫ్ దేశాల్లో ఆందోళనలను మరింత పెంచింది. తమ భూభాగంలోకి అక్రమంగా చొరబడి, బుబియాన్ ద్వీపాన్ని ఆక్రమించేందుకు ఇరాన్ (Iran) ప్రయత్నించిందని ఆరోపించింది. మరోవైపు ఇరాన్ మాత్రం ఈ ఆరోపణల్ని ఖండించింది.
కువైట్‌లోని బుబియాన్ అతిపెద్ద ద్వీపం (Bubiyan Island). ఇందులో ఓడరేవులు, విద్యుత్ కేంద్రాలు, సబ్స్టేషన్లతో సహా ప్రధాన పౌర, సైనిక స్థావరాలు ఉన్నాయి. ఈ నెల ఆరంభంలో చేపల పడవల్లో సముద్ర మార్గం ద్వారా ప్రయాణించి దీనిలోకి చొరబడేందుకు ఇరాన్‌లోని ఐఆర్జీసీ నేవీకి చెందిన ఆరుగురు సిబ్బంది ప్రయత్నించారని కువైట్ ప్రభుత్వం పేర్కొంది. వారు తమ భూభాగంలో దాడులు చేసేందుకు ప్రణాళికలు రచించారని ఆరోపించింది.
ఇవి కూడా చదవండి
అయితే ఈ చొరబాటును తమ బలగాలు సమర్థవంతంగా అడ్డుకున్నాయని వెల్లడించింది. ఈక్రమంలో నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకోగా.. మరో ఇద్దరు తప్పించుకున్నట్లు తెలిపింది. ఈ ఘర్షణల్లో తమ సాయుధ దళాల్లో ఒకరు గాయపడ్డారని వెల్లడించింది. ఈ చర్యలను కువైట్ విదేశాంగశాఖ తీవ్రంగా ఖండించింది. ఇరాన్ తక్షణమే బేషరతుగా ఈ చట్టవిరుద్ధమైన చర్యలను నిలిపివేయాలని డిమాండ్ చేసింది.
కాగా.. ఈ ఆరోపణలను ఇరాన్ తీవ్రంగా ఖండించింది. వారు సముద్ర గస్తీ విధుల్లో ఉన్నారని ఇరాన్ విదేశాంగ మంత్రిత్వశాఖ పేర్కొంది. నౌకాయానానికి అంతరాయం కలగడంతో గల్ఫ్ ప్రాదేశిక జలాల్లోకి ప్రవేశించాల్సి వచ్చిందని స్పష్టం చేసింది. గల్ఫ్‌పై దాడులకు ఇరాన్ ప్రణాళిక చేసిందంటూ కువైట్ చేసిన ఆరోపణలు కూడా తోసిపుచ్చింది.
ఇరాన్‌పై సౌదీ రహస్య ఆపరేషన్..!
పశ్చిమాసియాలో ఉద్రిక్తతల సమయంలో ఇరాన్ దాడులకు సౌదీ అరేబియా (Saudi Arabia) కూడా ప్రతీకార దాడులు చేసినట్లు బయటకొచ్చింది. మార్చి నెలాఖరులో సౌదీ వైమానిక దళం ఈ రహస్య దాడులకు పాల్పడినట్లు తాజాగా మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. అయితే వేటిని లక్ష్యంగా ఈ దాడులు జరిగాయనే దానిపై స్పష్టత లేదు. దీనిపై సౌదీ గానీ.. ఇరాన్ గానీ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.
ఇవి కూడా చదవండి






