యుద్ధం ముగింపునకు ఇరాన్ కొత్త ప్రతిపాదనలు..!
పశ్చిమాసియా సంక్షోభ నివారణ దిశగా మరో కీలకపరిణామం చోటు చేసుకుంది. సంక్షోభాన్ని ముగించేందుకు ఇరాన్ (Iran) 14 పాయింట్లతో సరికొత్త ప్రతిదానలను తెరపైకి తెచ్చింది. అమెరికా నుంచి వచ్చిన 9 ప్రతిపాదనలకు బదులుగా ఇరాన్ ఈ 14 పాయింట్ల ప్రతిపాదనలను తెరపైకి తెచ్చింది. వీటిని పాకిస్తాన్ ద్వారా అమెరికాకు పంపినట్లు టెహ్రాన్ తెలిపింది.
ఇరాన్ ప్రతిపాదనల్లో లెబనాన్‌తో సహా అన్ని విధాలుగా యుద్ధాన్ని ముగించాలని టెహ్రాన్ పిలుపునిచ్చింది. అమెరికా ప్రతిపాదించిన కాల్పుల విరమణ పొడిగింపును ఇరాన్ తిరస్కరించింది. తాత్కాలిక సంధికి బదులుగా.. 30 రోజుల్లోగా యుద్ధం శాశ్వతంగా ముగించేలా సమగ్ర పరిష్కారాన్ని కోరింది. దీంతో పాటు తమపై మళ్లీ దాడులు చేయకుండా భద్రతా హామీలు ఇవ్వాలని, సరిహద్దు ప్రాంతాల్లో అమెరికా తన బలగాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది. వివిధ దేశాల్లో స్తంభింపజేసిన తమ ఆస్తులను విడుదల చేయాలని, తమపై విధించిన ఆంక్షలను కూడా ఎత్తివేయాలని ప్రతిపాదనల్లో ప్రస్తావించింది. హర్మూజ్ జలసంధిలో దిగ్బంధనాన్ని ఎత్తివేయడం, యుద్ధం కారణంగా జరిగిన నష్టానికి పరిహారం చెల్లించడం వంటివి కూడా ఇందులో ఉన్నాయి.
యుద్ధానికి శాశ్వత ముగింపు పలకడమే తమ ప్రతిపాదనల లక్ష్యమని ఇరాన్ విదేశాంగ శాఖ సహాయ మంత్రి కాజెమ్ ఘరీబాబాదీ పేర్కొన్నారు. దౌత్య మార్గాన్ని ఎంచుకోవాలా.. లేదంటే ఘర్షణ వైఖరినే కొనసాగించాలా అనే నిర్ణయం ఇప్పుడు అమెరికానే తీసుకోవాలన్నారు. తమ జాతీయ ప్రయోజనాలు, భద్రతను కాపాడుకునేందుకు ఇరాన్సిద్ధంగా ఉందని వ్యాఖ్యానించారు.
ఇరాన్ పంపిన ప్రతిపాదనలపై ట్రంప్ స్పందించారు. వీటిని త్వరలోనే తాను సమీక్షిస్తానని ట్రూత్ సోషల్ వేదికగా పేర్కొన్నారు. అయితే, గత 47 ఏళ్లుగా మానవాళికి, ప్రపంచానికి వారు చేసిన దానికి.. ఇంకా తగిన మూల్యం చెల్లించుకోలేదన్నారు. కాబట్టి.. ఈ ప్రణాళిక ఆమోదించేలా ఉంటుందని తాను అనుకోవడం లేదన్నారు.






