Afghanistan: మానుంచి మీకు ముప్పు ఉండదు.. భారత్(India) కు తాలిబన్ల భరోసా..
భారత్ కు సమస్యగా మారుతుందనుకున్న ఆఫ్గనిస్తాన్.. ఇప్పుడు మిత్రదేశంగా మారుతోంది. ఆప్ఘనిస్తాన్ ను హస్తగతం చేసుకున్న తాలిబన్లతో మనకు ముప్పు ఉంటుందని అందరూ భావించారు. అయితే ఇక్కడ కేంద్రం చాలా జాగ్రత్తగా పావులు కదిపింది. కొన్ని నెలలుగా ఆఫ్గనిస్తాన్ ముఖ్యులతో టచ్ లో ఉన్న భారత విదేశీవ్యవహారాల కార్యదర్శి విక్రమ్ మిశ్రి(vikram misrey).. లేటెస్టుగా ఆఫ్గనిస్తాన్ తాత్కాలిక విదేశీ వ్యవహారాల మంత్రి అమీర్ ఖాన్ ముత్తాఖితో దుబాయ్ లో చర్చలు జరిపారు. చర్చల అనంతరం భారత దేశం .. ఈప్రాంతంలో ముఖ్యమైన ఆర్థిక శక్తి అంటూ తాలిబన్లు ప్రకటించారు.
2021 ఆగస్టులో తాలిబన్లు అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత భారత్‌తో జరిగిన అత్యున్నత సమావేశమిది. ‘‘భారత్ అందించిన మానవీయ సాయానికి ధన్యవాదాలు. ఆర్థిక ప్రాతిపదికన మేం సమతులమైన విదేశాంగ విధానాన్ని రూపొందించుకున్నాం. మేము భారత్‌తో రాజకీయ, ఆర్థిక సంబంధాలను బలోపేతం చేసుకోవాలనుకుంటున్నాం’’ అని ఒక అధికారిక ప్రకటనలో అఫ్గానిస్థాన్ పేర్కొంది. అఫ్గానిస్థాన్ నుంచి భారత్‌కు ఎలాంటి ముప్పూ ఉండబోదని అందులో పేర్కొంది.
ఇటీవల ఆఫ్గనిస్థాన్ పౌరులే లక్ష్యంగా ఇటీవల పాకిస్థాన్ చేపట్టిన వైమానిక దాడులపై భారత్ తీవ్రంగా స్పందించింది. పాక్ చర్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన భారత్.. అమాయక పౌరులపై జరిగే ఎటువంటి దాడినైనా నిస్సందేహంగా ఖండిస్తామని స్పష్టం చేసింది. తన అంతర్గత వైఫల్యాలను పొరుగుదేశాలపైకి నెట్టేయడం పాకిస్థాన్‌కు అలవాటేనని మండిపడింది. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. డిసెంబరు 26న అఫ్గనిస్థాన్ పక్తియా ప్రావిన్సుల్లో పాకిస్థాన్ వైమానిక దళం జరిపిన దాడుల్లో కనీసం 46 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో మహిళలు, చిన్నారులే అధికంగా ఉన్నారు.
ఈ పరిణామాలతో ఇరుదేశాల మధ్య మైత్రి వెల్లివిరిసే అవకాశముందని తెలుస్తోంది. తాలిబన్లతో మైత్రి కారణంగా.. కశ్మీర్ లోకి తాలిబన్ మిలిటెన్సీ రాక తగ్గుతుందన్న అంచనాలున్నాయి. అయితే ప్రపంచంలోని అతి పెద్ద ప్రజాస్వామిక దేశం…ఉగ్రవాద రాజ్యంగా భావిస్తున్న ఆఫ్గనిస్తాన్ తో స్నేహవైఖరి అవలంభించడం ఆసక్తిదాయకమే.






