ట్రంప్ నోటి దురుసు.. ఇటలీ స్ట్రాంగ్ వార్నింగ్..!
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నోటి దురుసుతనం.. మిత్రులతో విరోధాలు తెచ్చిపెడుతోంది. మొన్నటి వరకూ ట్రంప్ ను వెనకేసుకుంటూ వచ్చిన మిత్రదేశం ఇటలీకి సైతం.. ఆయన తన నోటి దురుసుతనంతో కోపం తెప్పించారు.నేరుగా ఇటలీ ప్రధాని మెలోనీని ట్రంప్ టార్గెట్ చేయడం.. ఆమెకు ధైర్యం లేదంటూ మాట్లాడడంపై ఇటలీ స్ట్రాంగ్ రిప్లై ఇచ్చింది. ఉప్పు నిప్పులా ఉండే ఇటలీ అధికార, ప్రతిపక్ష పార్టీలు ట్రంప్ వ్యాఖ్యల దెబ్బకు ఒక్కటయ్యాయి. తమ దేశ ప్రధాని జార్జియా మెలోనికి మద్దతుగా నిలుస్తూ, ట్రంప్ తీరుపై ఇటలీ ప్రతిపక్ష నేత ఎల్లీ ష్లీన్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
ట్రంప్ నోటి దురుసు.. మండిపడ్డ ప్రతిపక్షం
ఇరాన్‌పై అమెరికా దాడులకు మద్దతు ఇవ్వనందుకు ప్రధాని మెలోనికి ధైర్యం లేదు అంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలను ఇటలీ తీవ్రంగా పరిగణించింది. ఈ వివాదంపై స్పందించిన ప్రతిపక్ష నేత ష్లీన్ పార్లమెంట్లో మాట్లాడుతూ.. ‘ట్రంప్.. మా దేశంపై, మా ప్రధానిపై నీ నోటి దురుసుతో చేసే దాడులను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించం’ అని ఘాటుగా హెచ్చరించారు. వెంటనే సభ కరతాళ ధ్వనులతో మార్మోగింది. ఏ విదేశీ అధినేతకు కూడా తమ దేశాన్ని అవమానించే హక్కు లేదని ఆమె తేల్చి చెప్పారు.
ఇవి కూడా చదవండి
పోప్‌పై వ్యాఖ్యలతో ముదిరిన వివాదం
క్యాథలిక్ చర్చి అధిపతి పోప్ లియో శాంతి కోసం చేసే పిలుపులను ట్రంప్ విమర్శించడంపై ప్రధాని మెలోని అభ్యంతరం వ్యక్తం చేశారు. మత పెద్దలు రాజకీయ నాయకుల మాట వినాలనడం సరికాదని, ట్రంప్ వ్యాఖ్యలు ఆమోదయోగ్యం కాదు అని ఆమె తేల్చి చెప్పారు. దీనికి ప్రతిగా ట్రంప్ స్పందిస్తూ.. ఇరాన్ అణ్వాయుధాలతో ఇటలీని పేల్చేస్తామని ప్రకటించినా మెలోనికి పట్టింపు లేదని విమర్శించారు. అయితే అమెరికా తమ వ్యూహాత్మక మిత్రదేశమే అయినప్పటికీ, విభేదాలు ఉన్నప్పుడు కుండబద్దలు కొట్టినట్లు చెప్పే ధైర్యం ఉందని మెలోని స్పష్టం చేశారు.
ఇజ్రాయెల్‌తో రక్షణ ఒప్పందం నిలిపివేత
ఈ పరిణామాల మధ్య ఇజ్రాయెల్‌తో ప్రతి ఐదేళ్లకోసారి చేసుకునే రక్షణ ఒప్పందాన్ని ఇటలీ తాత్కాలికంగా నిలిపివేసింది. లెబనాన్‌లోని తమ ఐరాస శాంతి పరిరక్షక దళాల కాన్వాయ్‌పై ఇజ్రాయెల్ దళాలు హెచ్చరిక కాల్పులు జరపడంతో ఇటలీ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కాల్పుల ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగనప్పటికీ, ఇజ్రాయెల్ దాడులను ఇటలీ విదేశాంగ మంత్రి ఆంటోనియో తజానీ తీవ్రంగా ఖండించారు. ఈ వ్యాఖ్యలపై ఇజ్రాయెల్ అసహనం వ్యక్తం చేస్తూ, ఇటలీ రాయబారికి సమన్లు జారీ చేసింది.
ఇవి కూడా చదవండి






