పశ్చిమాసియా, యూరప్ ను అమెరికా కాపాడిందా..?
ఇరాన్ పై యుద్ధం చేయడం ఒక ఎత్తైతే.. దాన్ని సమర్థించుకోవడం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు మరో తలకు మించిన భారంగామారింది. ట్రంప్ వైఖరి , మనస్తత్వం తెలిసిన వారెవరూ..ఆయన చెప్పినదాన్ని ఎస్ అనే పరిస్థితి లేదు. అయితే ..తాను చేసింది తప్పుకాదని సమర్థించుకోవాలి కాబట్టి.. ట్రంప్ మరోసారి ఇరాన్ పై దాడిని సమర్థించుకున్నారు. తాాము ఇరాన్ పై దాడి చేసి, దాన్ని రాజకీయ, రక్షణ సామర్థ్యాన్ని చాలా తగ్గించామన్నారు. లేదంటే ఇరాన్ తో ప్రపంచానికి పెనుముప్పు ఉండేదన్నారు.
ఇరాన్‌పై యుద్ధాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరోసారి సమర్థించుకున్నారు. బీ2 బాంబర్లతో ఆ దేశంపై దాడి చేసి.. అది అణ్వాయుధాన్ని తయారుచేయకుండా అడ్డుకున్నామన్నారు. ఒకవేళ తాను అలా చేయకుంటే.. పశ్చిమాసియా, యూరప్ దేశాలు ముక్కలైపోయి ఉండేవని వ్యాఖ్యానించారు. ఫ్లోరిడాలో ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.
తాము భీకర దాడులు చేయబట్టి ఇరాన్ నాయకత్వం కూడా బలహీనపడిందని పేర్కొన్నారు ట్రంప్. దీంతో ఆ దేశ సైనిక సామర్థ్యం గణనీయంగా క్షీణించిందన్నారు. తమ సైనిక చర్యతో ఇరాన్ నాశనమైందని.. వారి వైమానిక, నౌకాదళాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయని మరోసారి ఉద్ఘాటించారు. శాంతిచర్చలు తాను ఆశించినవిధంగా జరగకపోవడంపై ట్రంప్ అసహనం వ్యక్తంచేశారు.
యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా నెలకొన్న ఇంధన సంక్షోభంపై ట్రంప్ మాట్లాడారు. ‘పెట్రోల్ ధరలు ఎక్కువగా ఉన్నాయి. ఘర్షణ ముగిశాక.. అణ్వాయుధాలు లేని ఇరాన్‌ను మనం చూస్తాం. అణ్వాయుధాలు కలిగిఉండడానికి వారికి అనుమతిస్తే.. అది ప్రపంచం మొత్తానికి ప్రమాదం. కాబట్టి అలా జరగకూడదు. యుద్ధం ముగిసిన వెంటనే పెట్రోల్ ధరలు తగ్గుతాయి’ అని ట్రంప్ అన్నారు. ఇరాన్ తమతో ఒప్పందం చేసుకోవాలనుకుంటుందని కానీ, వారి ప్రతిపాదన సంతృప్తిగా లేదన్నారు. ఇరాన్లో నాయకత్వం విచ్ఛిన్నం అయ్యిందని.. అక్కడ నాలుగైదు గ్రూపులు ఉన్నాయన్నారు. ఒప్పందం విషయంలో వారి మధ్య గందరగోళం నెలకొందన్నారు.






