CANADA: కెనడా ప్రధాని పదవికి ట్రూడో రిజైన్..!
కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో …ప్రధాని పదవికి రాజీనామా చేయనున్నారు.. ప్రధాని పదవితో పాటు లిబరల్(Liberal) పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటున్నారు. అయితే..తన వారసుడిని పార్టీ ఎంపికచేసే వరకూ ప్రధాని పదవిలో కొనసాగుతానని స్పష్టీకరించారు. పార్టీ పదవితోపాటు ప్రధాని బాధ్యతలను మార్క్ కార్నీ(Carney), లీ బ్లాంక్(Le blanc)లలో ఒకరు చేపట్టనున్నట్లు సమాచారం. ‘కొత్త నేతను పార్టీ ఎన్నుకున్న తర్వాత పార్టీ అధ్యక్ష పదవికి, ప్రధాని పదవికి రాజీనామా చేయాలని అనుకుంటున్నా’ అని ట్రూడో తెలిపారు. కొత్త నేతను ఎన్నుకునేదాకా కెనడా పార్లమెంటును సస్పెండు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇది మార్చి 24వ తేదీ వరకూ కొనసాగుతుందని వెల్లడించారు.
53 ఏళ్ల ట్రూడో పాలనపై కొంతకాలంగా కెనడా వాసుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. రాజకీయంగానూ ఆయన ఆటుపోట్లు ఎదుర్కొంటున్నారు. రాజీనామా చేయాలని సొంత పార్టీ ఎంపీల నుంచి తీవ్ర ఒత్తిడి వస్తోంది. 2015లో ప్రధానిగా పగ్గాలు చేపట్టిన ట్రూడో.. ఇటీవలి కాలంలో దేశీయంగా, అంతర్జాతీయంగా అపఖ్యాతి పాలయ్యారు. ఖలిస్థానీ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత ఏజెంట్ల పాత్ర ఉందని ఎలాంటి సాక్ష్యాలు లేకుండానే ఆయన ఆరోపణలు చేశారు. దీంతో భారత్, కెనడా సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో నెగ్గిన ట్రంప్.. ట్రూడో పాలనపై ఇటీవల బహిరంగంగా విమర్శలు చేశారు. డ్రగ్స్, అక్రమ వలసలను కెనడా కట్టడి చేయకపోతే.. ఆ దేశంపై 25 శాతం పన్ను విధిస్తామని హెచ్చరించారు. దీంతో ట్రూడోపై ఒత్తిడి మరింత పెరిగింది. ఇటీవల ఉప ప్రధాని, ఆర్థిక మంత్రి పదవికి క్రిస్టియా ఫ్రీలాండ్ రాజీనామా చేశారు. ఆమె ట్రూడో ఆర్థిక విధానాలను తీవ్రంగా తప్పుబట్టారు. ఇటీవల జరిగిన సర్వేల్లోనూ ట్రూడో జనాదరణ భారీగా తగ్గింది. ప్రతిపక్ష కన్సర్వేటివ్ పార్టీవైపు 47 శాతం మొగ్గితే.. 21 శాతం మందే లిబరల్ పార్టీకి అనుకూలంగా స్పందించారు.
లిబరల్ పార్టీతోపాటు ప్రధాని బాధ్యతలను మార్క్ కార్నీ, లీ బ్లాంక్లలో ఒకరు చేపట్టే అవకాశముంది. కార్నీ గతంలో బ్యాంక్ ఆఫ్ కెనడా, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ సారథ్య బాధ్యతలను నిర్వహించారు. ఎప్పటి నుంచో రాజకీయాల్లో ప్రవేశించాలని, ప్రధాని కావాలని ఉవ్విళ్లూరుతున్నారు. మరోవైపు దేశానికి అందించిన సేవలకుగానూ ట్రూడోకు కార్నీ కృతజ్ఞతలు తెలిపారు. లీ బ్లాంక్ న్యాయవాదిగా పని చేశారు. ఎంపీగా ఉన్నారు.
జస్టిన్ ట్రూడో దాదాపు 10 ఏళ్లపాటు కెనడా రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. 2013లో పార్టీ తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న వేళ అతడు ప్రధాని పదవిని స్వీకరించాడు. ఆ తర్వాత పార్టీలో అతడికి ఎదురులేకుండా పోయింది.రెండో దఫా ఎన్నికల్లో పూర్తిస్థాయి మెజార్టీ రాకపోవడంతో జగ్మీత్ సింగ్ పార్టీ మద్దతుతో ప్రభుత్వాన్ని నడిపారు. అయితే ఈసమయంలో ఖలిస్తానీ సానుభూతిపరులకు అనుకూలంగా ప్రవర్తిస్తూ.. భారత్తో సంబంధాలు దిగజారడానికి ప్రధాన కారణమయ్యారు.ఇతర దేశాలతో సైతం సంబంధాలు పూర్తిగా క్షీణించడానికి ట్రూడో కారణమయ్యారని ఆరోపణలున్నాయి.






