Asim Munir: పాకిస్తాన్ ఆర్మీలో అంతర్గత తిరుగుబాటు..?
పాకిస్తాన్ (Pakistan) పరిస్థితి మరింత దయనీయంగా మారుతోంది. ఓవైపు అధిక ధరలు, ద్రవ్యోల్బణంతో జనం విసిగిపోతున్నారు. మరోవైపు ఉగ్రదాడులు నిత్యకృత్యంగా మారాయి. బలూచ్ లిబరేషన్ ఆర్మీ(BLA).. నేరుగా తొడగొట్టి మరీ దాడులు చేస్తోంది. ఇటీవలే జాఫర్ ఎక్స్ ప్రెస్ ను హైజాక్ చేయడమే కాదు… అందులోని 200 మంది ఆర్మీ, ఐఎస్ఐ అధికారులను చంపేశారు. ఈ పరిణామంతో ఆర్మీలో పెనుగుబులు రేగింది. మరోవైపు.. తాలిబన్ అనుకూల ఉగ్రసంస్థ తెహ్రీక్ ఏ పాక్.. నేరుగా ఆర్మీ హెడ్ క్వార్టర్స్ పై దాడి చేసి, టెన్షన్ పెడుతోంది. ఇవి చాలవన్నట్లుగా పాక్ ఆర్మీలోనూ అంతర్గత విభేదాలు బట్టబయలయ్యాయి.
ఈ నేపథ్యంలో పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌పై తీవ్ర ఒత్తిడి నెలకొంది. ప్రస్తుతం ఆర్మీ చీఫ్ పదవి నుంచి దిగిపోవాలని జూనియర్ అధికారులు, మాజీ జనరల్స్ హెచ్చరిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో పాకిస్తాన్ ఆర్మీలో తిరుగుబాటు తప్పదా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆసిమ్ మునీర్ సైన్యాన్ని రాజకీయ అణచివేతకు సాధణంగా వాడుకుని ప్రతీకార చర్యలకు పాల్పడుతున్నట్లు అధికారులు ఆరోపించారు.
నివేదికల ప్రకారం.. కల్నల్స్, మేజర్లు, కెప్టెన్లు, జవాన్లు ఈ మేరకు లేఖ రాసినట్లు తెలుస్తోంది. మునీర్ పాలనలో పాకిస్తాన్ 1971 నాటి పరిస్థితుల్ని ఎదుర్కొంటోందని ఆర్మీ అధికారులు బంగ్లాదేశ్ విభజనను పరోక్షంగా ఉద్దేశిస్తూ లేఖలో పేర్కొన్నారు. మునీర్ వెంటనే రాజీనామా చేయాలని లేకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించినట్లు తెలుస్తోంది. రాజకీయ అసమ్మతిని అణచివేయడానికి, జర్నలిస్టుల్ని సైలెంట్ చేయడానికి, ప్రజాస్వామ్య శక్తుల్ని అణచివేయడానికి ఉపయోగించి మునీర్ సైన్యం ప్రతిష్టను దిగజార్చారని లేఖలో ఆరోపించారు. ఒక వేళ రాజీనామా చేయకుంటే సైన్యం స్వయంగా చర్య తీసుకుంటుందని లేఖలో హెచ్చరించారు.






