Bangladesh: హసీనాపై మరో అరెస్ట్ వారెంట్..
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాను స్వదేశానికి రప్పించేందుకు మధ్యంతర ప్రభుత్వం అన్నిప్రయత్నాలు చేస్తోంది. దీనిలో భాగంగా ఇప్పటికే షేక్ హసీనాపై ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యూనల్ (ICT) వారెంట్ జారీ చేసింది.అయితే అవి ఫలించలేదు. దీంతో మరోసారి అరెస్ట్ వారెంట్ జారీ చేసింది ట్రైబ్యునల్. ఆమెతోపాటు మరో 12 మంది పేర్లనుకూడా దీనిలో చేర్చింది. దేశంలో పలువురి అదృశ్యాలు, హత్యలకు సంబంధించిన ఈ వారెంట్ జారీ అయింది. వారిని కోర్టు ఎదుట ప్రవేశపెట్టడానికి ఫిబ్రవరి 12వ తేదీ వరకు గడువు విధించింది.
హసీనా రక్షణ సలహాదారు మేజర్ జనరల్ (రిటైర్డ్) తారిక్ అహ్మద్ సిద్ధిఖీ, మాజీ ఐజీ బెనజీర్ అహ్మద్, మాజీ నేషనల్ టెలికమ్యూనికేషన్ మానిటరింగ్ సెంటర్ డీజీ జియావుల్ అహ్సాన్ వీరిలో ఉన్నారు. హసీనా భారత్కు వెళ్లిపోయిన నాటి నుంచి ఆమెపై జారీ అయినా రెండో వారెంట్ ఇది. తాజాగా వారెంట్ జారీ చేసిన ఐసీటీ అనంతరం ఇంటర్పోల్ సాయం కూడా కోరింది. హసీనాపై తొలి వారెంట్ గతేడాది అక్టోబర్లో జారీ అయింది. దీనిలో ఆమెతోపాటు 45 మందిని నిందితులుగా చేర్చారు. నాడు నవంబర్ 18 నాటికి తమ ఎదుట హాజరుపర్చాలని ఆదేశాలు జారీ చేశారు. కానీ, అవి అమలు కాలేదు.
విద్యార్థి ఉద్యమం ముగిసిన తర్వాత కొత్తగా ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వం ఓ హామీ ఇచ్చింది. ఉద్యమంలో ఆందోళనకారుల ప్రాణాలు తీసిన వారిని ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యూనల్ ఎదుట హాజరుపరుస్తామని పేర్కొంది. హసీనా దేశం వీడిన తర్వాత హింస చెలరేగడంతో బంగ్లాదేశ్లో దాదాపు 230 మంది ప్రాణాలు కోల్పోయారు. జులై మధ్యలో విద్యార్థి ఉద్యమం ప్రారంభం నుంచి చూస్తే దాదాపు 600 మంది ప్రాణాలు కోల్పోయారు.






