ASBL NSL Infratech

జీఈఎస్‌ సదస్సుకు మోదీ, ఇవాంకా ట్రంప్‌

జీఈఎస్‌ సదస్సుకు మోదీ, ఇవాంకా ట్రంప్‌

ప్రపంచ ఎంట్రప్రెన్యూర్‌షిప్‌ సమ్మిట్‌ (జీఈఎస్‌)కు ఆసియాలోనే తొలిసారిగా హైదరాబాద్‌ వేదికైంది. ఈ సదస్సుకు ముఖ్య అతిథులుగా ప్రధామంత్రి నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కుమార్తె ఇవాంకా ట్రంప్‌ హాజరవుతారు. నవంబర్‌ 28 నుంచి 30 వరకు 3 రోజుల పాటు మాదాపూర్‌లోని హెచ్‌ఐసీసీలో జరిగే ఈ సదస్సును 28 సాయంత్రం 5-7 గంటల మధ్య నరేంద్ర మోదీ, ఇవాంకా ట్రంప్‌ ప్రారంభిస్తారు. ఆర్థిక, వ్యవస్థాపక రంగాల్లో మహిళల పాత్ర అనే అంశంపై వీరు మాట్లాడతారు. ఆ తర్వాతి రోజు నుంచి సదస్సు ప్రారంభమవుతుంది. వైట్‌ హౌస్‌ జెన్నిఫర్‌ అరంగియో, యూఎస్‌ కాన్సుల్‌ జనరల్‌ క్యాథరిన్‌ హడ్డా, నీతి ఆయోగ్‌ సీనియర్‌ అడ్వైజర్‌ సి.మురళీకృష్ణ కుమార్‌ మీడియాతో మాట్లాడారు. అమెరికా, భారత ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ సదస్సులో 1,500 మందికి పైగా పారిశ్రామికవేత్తలు, ప్రముఖ కంపెనీ సీఈఓలు, ఇన్వెస్టర్లు పాల్గొంటారని జెన్నిఫర్‌ తెలిపారు. అమెరికాకు చెందిన సుమారు 130కి పైగా కంపెనీలు హైదరాబాద్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని, ఇరు దేశాల్లో లక్షల మంది యువతకు ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్నాయని, అందుకే  జీఈఎస్‌ను ఇక్కడ నిర్వహించాలని నిర్ణయించామని ఆమె తెలియజేశారు.

మహిళలు అర్థికంగానూ, వ్యవస్థాపక రంగంలోనూ వృద్ధి చెందితే సమాజం, దేశం అభివృద్ధి చెందుతుందని, అందుకే సదస్సుకు మహిళ ప్రథమం- అందరకీ శ్రేయస్కరం అనే థీమ్‌ను తీసుకున్నామని అన్నారు. 3వేలకు పైగా సందర్శకులు పాల్గొనే ఈ సదస్సులో సగానికి పైగా మహిళా సందర్శకులుండే అవకాశముందని అన్నారు. హెల్త్‌కేర్‌ అండ్‌ లైఫ్‌ సైన్స్‌, డిజిటల్‌ ఎకానమీ అండ్‌ ఫైనాన్షియల్‌ టెక్నాలజీ, ఎనర్జీ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, మీడియా అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ వంటి నాలుగు విభాగాల్లోని కంపెనీల ప్రతినిధులు హాజరయ్యే అవకాశముందని, ఆయా రంగాల్లోని కంపెనీ సీఈఓలు, ఇన్వెస్టర్లు సదస్సులో పాల్గొని ప్రసంగాలు చేస్తారని, శిక్షణ శిబిరాలతో పాటు అనుభవాలను పంచుకుంటారని మురళీకృష్ణ కుమార్‌ తెలిపారు. ఈ సదస్సు వేదికగా పలు కంపెనీలు ఎంవోయూ చేసుకునే అవకాశముందని పేర్కొన్నారు.

Tags :