యువత ఆలయాలకు రావాలంటే ఆ పని చేయాలి : ఇస్రో చైర్మన్ ఆసక్తికర వ్యాఖ్యలు
యువత ఆలయాలకు రావాలంటే ఆలయాల్లో తప్పనిసరిగా గ్రంథాలయాలు ఏర్పాటు చేయాలని ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేరళ రాజధాని తిరువనంతపురంలోని శ్రీ ఉదియనూర్ దేవీ ఆలయంలో ఇస్రో మాజీ చైర్మన్ మాధవన్ నయ్యర్ చేతుల మీదుగా ఆయన ఓ అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా సోమనాథ్ మాట్లాడుతూ ఆలయాలు దేవుడిని స్మరించుకునేందుకు వచ్చే వృద్ధులకు మాత్రమే కాకుండా సమాజాన్ని మార్చే ప్రదేశాలుగా మారాలన్నారు. సమాజాన్ని మార్చే శక్తి గుడులకు ఉంటుంది. దేశవ్యాప్తంగా ఉన్న ఆలయాలకు యువతను రప్పించాలి. నా అవార్డు ప్రదాన కార్యాక్రమంలో యువత ఎక్కువగా కనిపిస్తారని ఆశించాను. కానీ యువత ఎక్కువగా రాలేదు. వారిని ఆకర్షించడానికి ఆలయాల్లో గ్రంథాలయాలు ఏర్పాటు చేయాలన్నారు. పుస్తకాలు చదివే ఆసక్తి ఉన్న యువత ఆలయాల బాట పడతారు. పుస్తకాలు చదివి జ్ఞానసంపద పెంచుకుని, ఉన్నతమైన జీవితానికి బాటలు వేసుకుంటారు. ఆలయ సిబ్బంది లైబ్రరీలను అందుబాటులోకి తెస్తే ఎన్నో మార్పులు చూడవచ్చు అని సలహా ఇచ్చారు.