ASBL Koncept Ambience
facebook whatsapp X

కొత్త ఎంపీలకు పార్లమెంటులో స్వాగత సన్నాహాలు

కొత్త ఎంపీలకు పార్లమెంటులో స్వాగత సన్నాహాలు

ఈసారి అనుబంధ భవనంలో ఏర్పాట్లు దిల్లీ విమానాశ్రయం, రైల్వేస్టేషన్లలో కేంద్రాలు. లోక్‌సభ ఎన్నికలు దశలవారీగా పూర్తవుతున్న నేపథ్యంలో నూతన ఎంపీలకు స్వాగతం పలికేందుకు కావాల్సిన ఏర్పాట్లపై అధికార యంత్రాంగం దృష్టి కేంద్రీకరించింది. నూతన పార్లమెంటు భవనం వెలుపల పునరభివృద్ధి పనులు కొనసాగుతుండడంతో అనుబంధ భవనంలో సభ్యులకు ఘన స్వాగతం లభించే అవకాశం ఉంది. 

అధికారిక వేడుకలకు వీలుగా నూతన పచ్చిక బయళ్లను తీర్చిదిద్దడం, విగ్రహాలను వేరేచోటకు తరలించడం, ఎంపీలు తమ వాహనాల నుంచి దిగి బ్యాటరీ వాహనాల్లోకి మారే ప్రదేశాలను కేటాయించడం వంటివి ప్రస్తుతం కొనసాగుతున్నాయి. దీంతో మునుపటి మాదిరిగా వర్తులాకార భవనం (ప్రస్తుత సంవిధాన్‌ సదన్‌)లో కాకుండా అనుబంధ భవనంలో ఎంపీలను స్వాగతించనున్నారు. 

దిల్లీలోని రాష్ట్ర ప్రభుత్వాల అతిథి గృహాల్లో, 'వెస్టర్న్‌ కోర్ట్‌ హాస్టల్‌ కాంప్లెక్స్‌'లో లోక్‌సభ నూతన సభ్యులకు తాత్కాలిక వసతి కల్పిస్తారు. మాజీ సభ్యులు తమ అధికారిక నివాసాలు ఖాళీ చేసేందుకు కొంత గడువు ఉంటుంది. వాటికి అవసరమైన మరమ్మతులతో ఆ తర్వాత మెరుగులు దిద్ది, కొత్తవారికి కేటాయిస్తారు. 

4 నుంచే సభ్యులు వచ్చే అవకాశం 

జూన్‌ 4న ఓట్ల లెక్కింపు జరగనుండడంతో ఆరోజు సాయంత్రం నుంచే నూతన సభ్యులు దిల్లీకి చేరుకుంటారని భావిస్తూ లోక్‌సభ సచివాలయం తగిన ఏర్పాట్లు చేస్తోంది. పార్లమెంటు భవనంలో ప్రవేశానికి, వివిధ సదుపాయాలు పొందడానికి అవసరమైన స్మార్ట్‌కార్డుల కోసం నూతన సభ్యులు వేర్వేరు దరఖాస్తులు నింపాల్సి ఉంటుంది. వాటిని స్వీకరించి, వారిని ఫోటో తీసేందుకు బాంకెట్‌ హాల్లో, ఇతర గదుల్లో ప్రత్యేక బూత్‌లు ఏర్పాటు చేస్తున్నారు. 

దిల్లీ విమానాశ్రయం, రాజధానిలోని వివిధ రైల్వేస్టేషన్లలో ఆహ్వాన కేంద్రాలు ఉంటాయి. కొత్త సభ్యులను అక్కడి నుంచి పార్లమెంటు భవనానికి తీసుకువెళ్తారు. వారికి కొత్త ఫోన్‌ కనెక్షన్లు, వాహనాల ఫాస్టాగ్‌ స్టిక్కర్లు, నూతన బ్యాంకు ఖాతాలు, దౌత్యపరమైన పాస్‌పోర్టులు, అధికారిక ఈ-మెయిల్‌ ఖాతాలు, కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకంలో సభ్యత్వం వంటివి ఇచ్చేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

 

- జి.సురేందర్, భూవిజన్ న్యూస్

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :