ASBL NSL Infratech

హైదరాబాద్‌ వచ్చిన అమెరికా బలగాలు

హైదరాబాద్‌ వచ్చిన అమెరికా బలగాలు

ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు (జీఈఎస్‌)కు ఇక పక్షంరోజులే సమయం ఉండటంతో వివిధ దేశాల నుంచి హాజరయ్యే ప్రముఖుల భద్రతపై రాష్ట్ర పోలీస్‌శాఖ కసరత్తు చేసింది. భద్రతా ఏర్పాట్లు, చేపట్టాల్సిన చర్యలు ఇతర అంశాలపై నిత్యం సమీక్షలు నిర్వహిస్తున్నది. ఈ నెల 28 నుంచి 30 వరకు హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో జరగనున్న జీఈఎస్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కూతురు ఇవాంక ట్రంప్‌, ప్రధాని నరేంద్రమోదీ హాజరవుతున్న సంగతి తెలిసిందే. వీరితో పాటు ప్రపంచవ్యాప్తంగా 160 దేశాలకు చెందిన 1600 మంది పారిశ్రామికవేత్తలు హాజరవుతున్న నేపథ్యంలో రాష్ట్ర పోలీస్‌శాఖ భద్రతా చర్యలను ప్రతిష్ఠాత్మకంగా చేపట్టింది. నెల కిందటే హైదరాబాద్‌కు వచ్చిన అమెరికా ప్రత్యేక భద్రతా బలగాలు, కేంద్ర స్పెషల్‌ ప్రొటెక్షన్‌ గార్డ్‌ (ఎస్పీజీ) రాష్ట్ర బలగాలైన ఇంటెలిజెన్స్‌ సెక్యూరిటీ వింగ్‌ (ఐఎస్‌డబ్ల్యూ)తో కలిసి పనిచేస్తున్నాయి.

ఇవాంక ట్రంప్‌ ఈ నెల 27వ తేదీ రాత్రి హైదరాబాద్‌కు వస్తారని, ఆ రోజు రానిపక్షంలో 28వ తేదీ ఉదయం వస్తారని, 28వ తేదీ రాత్రి ఫలక్‌నూమాలోని చౌహమల్లా ప్యాలెస్‌లో ఆమె భోజనం చేస్తారన్నారు. భద్రతపై ప్రతిరోజు సాయంత్రం అమెరికా, భారత భద్రతా, రాష్ట్ర బలగాలు సమీక్ష నిర్వహిస్తున్నాయి. సదస్సు నిర్వహించే ప్రాంగణం, ఆ పరిసరాల్లో అమెరికా భద్రతా బలగాలను మాత్రమే అనుమతించాలని ఇవాంకా సెక్యూరిటీ సిబ్బంది కేంద్ర బలగాలను కోరినట్లు తెలిసింది. ప్రస్తుతం రూట్‌, బసచేసే కేంద్రాలు, భద్రతపై చర్చ జరుగుతుందని, మూడు నాలుగురోజుల్లో అన్ని విషయాల్లో సృష్టత వస్తుందని సీనియర్‌ పోలీస్‌ అధికారి ఒకరు తెలిపారు.

Tags :