Jairam Ramesh: భారత పాలసీలను ట్రంప్ ప్రకటిస్తారా?.. మోడీపై కాంగ్రెస్ ఫైర్

భారత ప్రధాని నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మధ్య జరిగిన టెలిఫోన్ సంభాషణపై కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ (Jairam Ramesh) కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా నుండి చమురు కొనుగోళ్లను క్రమంగా తగ్గిస్తామని ప్రధాని మోడీ హామీ ఇచ్చినట్లు ట్రంప్ ప్రకటించడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ట్రంప్ కేవలం దీపావళి శుభాకాంక్షలు తెలిపారని, అందుకు ధన్యవాదాలు తెలుపుతున్నానని ప్రధాని మోడీ (PM Modi) సోషల్ మీడియాలో చెప్పారని రమేశ్ గుర్తుచేశారు.
అయితే రష్యా చమురు కొనడం అనేది భారత విధానపరమైన నిర్ణయమని, దీన్ని కూడా ట్రంప్ ప్రకటించడం ఏంటని ఆయన (Jairam Ramesh) నిలదీశారు. ఇలాంటి విషయాలు ప్రధాని మోడీ దాస్తున్నారని, ప్రజలకు తెలియనివ్వడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. భారత్ విధానాలను ట్రంప్ ప్రకటించడం ఆరు రోజుల్లో ఇది నాలుగోసారని ఆయన మండిపడ్డారు. గతంలో ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో భారత్, పాక్ సీజ్‌ఫైర్‌ను కూడా ముందుగా ట్రంప్ ప్రకటించారని గుర్తుచేశారు.
ఇలా భారతదేశ విధానపరమైన నిర్ణయాలను ట్రంప్ ప్రకటించడం భారత సార్వభౌమత్వాన్ని ప్రశ్నించడమేనని, ఈ అంశాలపై ప్రధాని మోడీ మౌనంగా ఉండటం ఏంటని జైరాం రమేశ్ (Jairam Ramesh) నిలదీశారు.