వాట్సాప్ వినియోగదారులకు మరో అవకాశం

వాట్సాప్ వినియోగదారులకు మరోసారి ఊరట లభించింది. తమ ప్రైవసీ విధానానికి ఆమోదం తెలపకపోయినా వారి ఖాతాలు తొలగించమని వాట్సాప్ యాజమాన్యం హామీ ఇచ్చింది. తమ ప్రైవసీ విధానానికి మే 15లోగా ఖాతాదారులు ఆమోదం తెలపాలని, లేదంటే ఖాతాలు తొలగిస్తామంటూ వాట్సాప్ యాజమాన్యం గతంలో డెడ్‍లైన్‍ను విధించింది. ఇప్పుడు ఆ డెడ్‍లైన్ విషయంలో వెసులుబాటు కల్పిస్తూ తాజాగా వినియోగదారులకు మరో అవకాశం కల్పించింది. మరికొన్ని వారాలపాటు తమ ప్రైవసీ విధానంపై వినియోగదారులకు రీమైండర్లు పంపిస్తామని వాట్సాప్ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. అయితే, మరో గడువు ఏదీ ప్రస్తుతానికి ప్రకటించలేదు.