Modi: మోదీ రిటైర్మెంట్ ఎప్పుడంటే…!?

ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) ఇటీవలే తన 75వ పుట్టినరోజును జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన రిటైర్మెంట్‌పై పలు ఊహాగానాలు మొదలయ్యాయి. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS)లో 75 ఏళ్లకు రిటైర్మెంట్ నిబంధన ఉంది. దీంతో ఆర్ఎస్ఎస్ ఆదేశాల మేరకు ప్రధాని మోదీ కూడా తప్పుకుంటారని, రాజకీయ విరమణ చేస్తారని చాలాకాలంగా ఊహాగానాలున్నాయి. అయితే అలాంటి ఊహాగానాలకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) చెక్ పెట్టారు. 2047 వరకూ మోడీ ప్రధానిగా ఉంటారని, ఇందులో ఎలాంటి అనుమానాలూ అక్కర్లేదని తేల్చేశారు. దీంతో మోదీ రిటైర్మెంట్ రూమర్లకు బ్రేక్ పడింది.
ఆర్‌ఎస్‌ఎస్‌లో 75 ఏళ్లకు రిటైర్డ్ కావాలనే నియమం ఉంది. 2000లలో ఎల్‌కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి వంటి సీనియర్ నేతలకు ఈ రూల్ అప్లై చేశారు. ఇదే నియమం భారతీయ జనతా పార్టీ (BJP)లో కూడా అనధికారికంగా పాటిస్తారని చాలామంది భావిస్తారు. ప్రధాని మోదీ ఈ నెల 17న 75 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. దీంతో మోదీ రాజీనామా చేస్తారని, ఆయన బాధ్యతలను మరొకరికి అప్పగిస్తారనే ప్రచారం చాలాకాలంగా జరుగుతోంది. ఈ ఊహాగానాలకు మొదటి కారణం మోహన్ భాగవత్. జూలైలో ఆయన ఓ సమావేశంలో మాట్లాడుతూ.. నాయకులు 75 ఏళ్లకు రిటైర్ అవ్వాలిని సూచించారు. మోదీని ఉద్దేశించే మోహన్ భగవత్ ఇలా మాట్లాడారని అందరూ చెప్పుకున్నారు. దీనిపై దేశవ్యాప్తంగా పెద్ద చర్చ జరిగింది. అయితే ఆగస్టు 28న ఆర్‌ఎస్‌ఎస్ శతాబ్ది ఉత్సవాల్లో మోహన్ భాగవత్ ఈ అంశంపై క్లారిఫై చేశారు. నేను ఎప్పుడూ 75కు రిటైర్ అవుతానని లేదా ఎవరైనా అలా చేయాలని చెప్పలేదన్నారు. దీంతో ఆ ఊహాగానాలకు తెరపడింది.
తాజాగా.. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మోదీ రిటైర్మెంట్‌పై మరింత స్పష్టత ఇచ్చారు. 2029, 2034, 2039, 2043 ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థిగా మోదీయే ఉంటారని తేల్చేశారు. అప్పటివరకూ ప్రధాని పదవికి వేకన్సీ లేదన్నారు. 2047లో స్వాతంత్ర్య శతాబ్ది ఉత్సవాలను నిర్వహించిన తర్వాత మోదీ రిటైర్డ్ అవుతారని రాజ్ నాథ్ సింగ్ చెప్పారు. వికసిత భారత్ 2047 లక్ష్యాలను పూర్తి చేసేంత వరకూ ఆయనే ప్రధాని అని చెప్పారు. రాజ్‌నాథ్ ప్రకటన అందరి అనుమానాలకు చెక్ పెట్టింది. బీజేపీలో రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యలు సంతోషాన్ని నింపాయి. అయితే మోదీ రిటైర్మెంట్ వ్యాఖ్యలు ఎప్పటి నుంచి వినిపిస్తున్నా బీజేపీ వాటిని ఖండిస్తూ వస్తోంది. అయితే ఇప్పుడు రాజ్‌నాథ్ సింగ్ కామెంట్స్ ఊహాగానాలకు పూర్తిగా చెక్ పెట్టాయి. మొత్తంగా మోహన్ భాగవత్ క్లారిఫికేషన్, రాజ్‌నాథ్ ప్రకటనలు మెదీ రిటైర్మెంట్ చర్చకు బ్రేక్ వేశాయి. 2047 వరకు మోదీయే ప్రధాని అని, ఆయన నాయకత్వంలోనే భారత్ అభివృద్ధి చెందుతుందని బీజేపీ తేల్చేసింది.