Tejashwi Yadav: నితీశ్ చేసిన కుంభకోణాల సంగతేంటి? మోడీని నిలదీసిన తేజస్వీ
ఎన్డీయే సీఎం అభ్యర్థిగా నితీశ్ కుమార్‌ను ప్రధాని మోడీ ప్రకటించడంపై ఆర్జేడీ నేత, విపక్షాల సీఎం అభ్యర్థి తేజస్వీ యాదవ్ (Tejashwi Yadav) విమర్శలు కురిపించారు. అవినీతిపరులకు ప్రధాని మోడీ కొమ్ము కాస్తున్నారన్న తేజస్వి.. ‘నితీశ్ ప్రభుత్వంలో 55 కుంభకోణాలు జరిగినట్లు ప్రధాని మోడీనే ఆరోపించారు. వాటిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఇలాంటి కుంభకోణాలపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా, క్రిమినల్స్ స్వేచ్ఛగా రోడ్లపై తిరిగితే దాన్నే ‘జంగిల్ రాజ్’ అంటారు’ అని విమర్శించారు. ఆర్జేడీ పాలనను ‘జంగిల్ రాజ్’ అంటూ ఎన్డీయే కూటమి విమర్శిస్తున్న నేపథ్యంలో తేజస్వీ (Tejashwi Yadav) ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
దేశంలో బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే అత్యధిక నేరాలు జరుగుతున్నాయని తేజస్వీ ఆరోపించారు. తాము అధికారంలోకి వస్తే ప్రజల సమస్యలు వినే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని, ప్రజలందరికీ అందుబాటు ధరల్లో వైద్యం, ఉద్యోగాలు అందిస్తానని హామీ ఇచ్చారు. తాను అబద్ధాలు చెప్పనని, చెప్పిందే చేస్తానని ఆయన (Tejashwi Yadav) అన్నారు. అధికారంలోకి వస్తే ప్రజల ముఖ్యమంత్రిగా ఉంటానని, వారి సమస్యలన్నీ వినే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు.







