EC: పారదర్శకంగానే ఓటర్ల జాబితా.. విపక్షాల విమర్శలను ఖండించిన ఈసీ
ఓటర్ల జాబితాలో అక్రమాలు జరుగుతున్నాయంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను ఎలక్షన్ కమిషన్ (EC) తీవ్రంగా ఖండించింది. గత ఎన్నికల ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయని చెప్పడం సరికాదని శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఈసీ పేర్కొంది. ఓటర్ల జాబితా తయారీ ప్రక్రియ అత్యంత పారదర్శకంగా ఉంటుందని, దీనిలో అన్ని రాజకీయ పార్టీల భాగస్వామ్యం ఉంటుందని వెల్లడించింది. ముసాయిదా ఓటరు జాబితా (Draft Voter List) విడుదలైన తర్వాత అభ్యంతరాలను సరైన సమయంలో లేవనెత్తాలని, అయితే కొన్ని పార్టీలు ఆ పని చేయకపోవడం వల్లే ఈ వ్యత్యాసాలు తలెత్తాయని ఈసీ (EC) ఆరోపించింది. లోపాలను సకాలంలో గుర్తించి ఉంటే ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్లు (ERO) వాటిని సరిదిద్ది ఉండేవారని తెలిపింది. రాజకీయ పార్టీల బూత్ స్థాయి ఏజెంట్లు జాబితాలను సరిగా పరిశీలించకపోవడమే ఈ తప్పులకు ప్రధాన కారణమని స్పష్టం చేసింది. ముసాయిదా ఓటర్ల జాబితాలను డిజిటల్, పేపర్ రూపంలో అన్ని పార్టీలకు అందజేస్తామని, అలాగే ఈసీఐ వెబ్సైట్లో కూడా అందుబాటులో ఉంచుతామని ఈసీ (EC) వివరించింది.







