Vice President: ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో గెలుపెవరిదో?
భారత రాష్ట్రపతి ఉప రాష్ట్రపతి (Vice President) పదవులకు ఎన్నికలు జరిగినా అవి పరోక్షంగా జరుగుతాయి. అంటే ప్రజలు వారిని డైరెక్టుగా ఎన్నుకోలేరు. కాకపోతే ప్రజలు గెలిపించిన ప్రజా ప్రతినిధులు వారిని ఎన్నుకుంటారు. ఉప రాష్ట్రపతి ఎన్నికల విషయానికి వస్తే లోక్సభ రాజ్యసభ ఎంపీలు ఆయనను ఎన్నుకుంటారు. ఇందులో నామినేటెడ్ ఎంపీలకు కూడా ఓటు చాన్స్ ఉంటుంది. అలా చూస్తే కనుక లోక్సభలో 542 మంది రాజ్యసభలో 240 మంది ఎంపీలు కలిపితే మొత్తం 782 మంది ఎంపీలు ఉప రాష్ట్రపతిని ఎన్నుకుంటారు. సగానికి కంటే ఎక్కువ ఓట్లు సంపాదించుకున్నవారు ఉప రాష్ట్రపతిగా నెగ్గినట్లు. అంతే కాదు ఆ రోజు ఓటింగుకు హాజరై ఓట్లు వేసిన వారిలో సగం పైగా ఏ అభ్యర్థికి వస్తాయో వారికే పీఠం దక్కుతుంది. ఈ లెక్కలు అన్నీ చూసుకున్నపుడు ఎన్డీయేదే పైచేయిగా ఉంటుంది అన్నది వాస్తవం. ఎన్డీయేకు లోక్సభలో 293 మంది, రాజ్యసభలో 129 మంది ఎంపీల మద్దతు ఉంది. ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ 394 ఉంది. అంటే ఈ లెక్కన ఎన్డీయేకు 422 మంది ఎంపీల సాలిడ్ మద్దతు ఉన్నట్లే. ఇక ఇండియా కూటమికి లోక్ సభ ప్లస్ రాజ్యసభ కలిపితే దాదాపుగా మూడు వందల మంది దాకా ఎంపీల మద్దతు ఉంది. ఈ రెండు పార్టీలు కాకుండా మిగిలిన వారు న్యూట్రల్ ఎంపీలు వారు అరవై మంది దాకా ఉంటారు. ఇక వారి ఓట్లు ప్లస్ ప్రత్యర్ధి శిబిరం నుంచి ఓట్లు కనుక దక్కితే ఫలితం సంచలనం అవుతుందని ఇండియా కూటమి ఆశ.
ఎన్నిక ఎలా అంటే…
ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో విప్ జారీ చేయడం ఉండదు. అంటే ఎంపీలను ఆయా పార్టీలు తమ పార్టీ అభ్యర్థికి ఓటు వేయమని విప్ ద్వారా శాసించలేవు. ఎవరికి నచ్చినట్లుగా వారు వేసుకునే వీలు ఉంది. అయితే అధికారికంగా విప్ జారీ చేయకపోయినా అనధికారికంగా ఆయా పార్టీలు తన ఎంపీల ఓట్లు జారీ పోకుండా చర్యలు తీసుకుంటాయి. దాంతో పార్టీ గీత దాటి ఓటు వేసే వారు బహు తక్కువ. మరో వైపు చూస్తే ఇది సిద్ధాంతపరమైన పోరుగా ఇండియా కూటమి అభి వర్ణిస్తోంది. రాజ్యాంగ వ్యవస్థలను రక్షించుకుంటామని చెబుతోంది. ఒక వైపు రాజ్యాంగ వ్యవస్థల మీద దాడులు అని ఇండియా కూటమి ప్రచారం చేస్తోంది. విపక్షాలు రాజకీయం అని బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే అంటోంది దాంతో ఈ ఎన్నిక ఉత్కంఠతో కూడుకున్నదిగా మారుతోంది. ఇంకో వైపు చూస్తే ఈ ఎన్నికల్లో గెలిచి రాజ్యసభలో తమ ఆధిపత్యం చూపించాలని ఇండియా కూటమి భావిస్తోంది. తమ పోరాటానికి ఎన్డీయే కూటమి నుంచి సైతం మద్దతు దక్కుతుందని ఆశిస్తోంది.
ఐదేళ్ళ పాటు పదవీకాలం
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 67 ప్రకారం భారత ఉపరాష్ట్రపతి ఐదేళ్ల పాటు పదవిలో కొనసాగాలని పేర్కొన్నారు. అదేవిధంగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 68లోని 2వ నిబంధన ప్రకారం చూస్తే కనుక ఉప రాష్ట్రపతి మరణం, రాజీనామా లేదా తొలగింపు లేదా ఇతర కారణాల వల్ల ఏర్పడిన ఖాళీని భర్తీ చేయడానికి ఎన్నికలు వీలైనంత త్వరగా నిర్వహిస్తారు. ఆ విధంగానే జగదీప్ ధంఖర్ రాజీనామా తరువాత ఎన్నికల నోటిఫికేషన్ని కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. దాని ప్రకారం సెప్టెంబర్ 9న ఈ ఎన్నికలు జరుగుతున్నాయి.
రాష్ట్రపతిని దేశంలోని అన్ని అసెంబ్లీలకు చెందిన ఎమ్మెల్యేలు ఎంపీలు ఎన్నుకుంటారు. అయితే ఉప రాష్ట్రపతిని రాజ్యసభ, లోక్సభ లతో కూడిన ఎలక్టోరల్ కాలేజ్ ద్వారా ఎన్నుకుంటారు. అదే విధంగా ఎగువ సభకు నామినేట్ చేయబడిన సభ్యులు కూడా ఎన్నికల ప్రక్రియలో ఓటు వేయడానికి అర్హులుగా ఉంటారు. ఇక చూస్తే కనుక రహస్య బ్యాలెట్ ద్వారా ఓటింగ్ జరుగుతుంది. అభ్యర్థి భారత పౌరుడై ఉండాలి, కనీసం 35 సంవత్సరాల వయస్సు ఉండాలి, రాజ్యసభకు ఎన్నిక కావడానికి అర్హత కలిగి ఉండాలి, లాభాపేక్ష కలిగిన ఎలాంటి పదవిని కలిగి ఉండకూడదు వంటి నిబంధనలు ఈ పదవికి విధించారు. దీనిని బట్టి చూస్తే ఎవరు ఉప రాష్ట్రపతిగా నెగ్గినా అయిదేళ్ళ పాటు ఈ పదవిలో కొనసాగుతారు. అంటే తిరిగి ఎన్నికలు 2030లో జరుగుతాయన్న మాట. అదే సమయంలో రాష్ట్రపతి ఎన్నికలు 2027లో జరుగుతాయి. ఇప్పటిదాకా రాష్ట్రపతి ఎన్నికలు ఒకే ఏడాది జరిగేవి. జూలైలో రాష్ట్రపతి ఎన్నికలు జరిగితే ఆగస్టులో ఉప రాష్ట్రపతి ఎన్నికలు జరుగుతూండేవి. ఇపుడు మాత్రం వేరు వేరుగా జరుగుతాయని అంటున్నారు.






