Rajnath Singh: రూ.1.5 లక్షల కోట్లు దాటిన రక్షణ ఉత్పత్తుల విలువ: రాజ్నాథ్ సింగ్
దేశీయ రక్షణ రంగ ఉత్పత్తిలో గణనీయమైన వృద్ధి నమోదైందని, 2024-25 ఆర్థిక సంవత్సరంలో రక్షణ ఉత్పత్తుల విలువ రూ.1.50 లక్షల కోట్లు దాటిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh) వెల్లడించారు. గతేడాదితో పోలిస్తే ఇది 18 శాతం వృద్ధి కాగా, ఐదేళ్ల కాలంలో ఏకంగా 90 శాతం పెరుగుదల కనిపించిందని ఆయన తెలిపారు. రక్షణ ఉత్పత్తుల విలువ రూ.1.5 లక్షల కోట్లకు చేరడం ఒక ఆల్టైమ్ రికార్డు అని రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఈ విలువ రూ.79 వేల కోట్లు మాత్రమేనని గుర్తుచేశారు. ఈ ఘనత సాధించడానికి డీఆర్డీవో (DRDO), రక్షణ రంగ విభాగాలు, అన్ని భాగస్వామ్య పక్షాల సమష్టి కృషి కారణమని ఆయన (Rajnath Singh) ప్రశంసించారు.
మొత్తం రక్షణ ఉత్పత్తుల్లో డిఫెన్స్ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ (DPSU) 77 శాతం, ప్రైవేటు రంగం 33 శాతం వాటా కలిగి ఉన్నాయని రాజ్నాథ్ సింగ్ తెలిపారు. రక్షణ పరికరాల కోసం దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకుని, భారత్ ఆత్మనిర్భరత సాధిస్తుందనడానికి ఇది ఒక నిదర్శనమని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలో దేశ అవసరాలను తీర్చుకోవడమే కాకుండా, రక్షణ ఉత్పత్తుల ఎగుమతి సామర్థ్యం కూడా గణనీయంగా పెంచుకున్నామని రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh) వివరించారు.







