8th Pay Commission: 8వ పే కమిషన్ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం
కేంద్ర ప్రభుత్వం తమ ఉద్యోగులు, పింఛన్‌దారులకు అతిపెద్ద శుభవార్తను అందించింది. 8వ వేతన సంఘం (8th Pay Commission) ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ కమిషన్‌కు జస్టిస్ రంజనా ప్రకాశ్ దేశాయ్‌ను చైర్‌పర్సన్‌గా నియమించినట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ (Ashwini Vaishnaw) వెల్లడించారు. ఈ కమిషన్ కేవలం 18 నెలల్లోనే వేతనాలు, పదవీ విరమణ ప్రయోజనాల (రిటైర్మెంట్ బెనిఫిట్స్)పై సవరణలను సిఫార్సు చేయనుంది. సుమారు 50 లక్షల మంది ఉద్యోగులను ప్రభావితం చేసే ఈ నిర్ణయం కోసం రక్షణ, హోం, రైల్వే వంటి కీలక శాఖలతో పాటు అనేక రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదింపులు జరిపినట్లు మంత్రి (Ashwini Vaishnaw) తెలిపారు.
8వ పే కమిషన్‌లో (8th Pay Commission) జస్టిస్ రంజనా ప్రకాశ్ దేశాయ్ చైర్‌పర్సన్‌గా, ఐఐఎం-బెంగళూరు ప్రొఫెసర్ పూలక్ ఘోష్ పార్ట్‌టైమ్ సభ్యుడిగా, పెట్రోలియం శాఖ కార్యదర్శి పంకజ్ జైన్ కార్యదర్శిగా నియమితులయ్యారు. సాధారణంగా ప్రతి పదేళ్లకోసారి వేతన సవరణలు చేస్తారు. దీనికోసం వేసిన 7వ వేతన సంఘం గడువు వచ్చే ఏడాది జనవరితో ముగియనుంది. ఈ నేపథ్యంలోనే 8వ పే కమిషన్‌ను (8th Pay Commission) నియమిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఆర్థిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని ఈ కమిషన్ నివేదికను రూపొందిస్తుంది. సాధారణంగా, ఈ సవరణలను కేంద్ర కేబినెట్ ఆమోదించిన తర్వాత అమలు చేస్తారు. తాజా పరిణామాల దృష్ట్యా, వచ్చే ఏడాది జనవరి జీతాల నుంచే ఈ వేతన పెంపు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.







