Amit Shah: ఢిల్లీ పేలుడు కారకులను కఠినంగా శిక్షిస్తాం: అమిత్ షా
ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన బాంబు పేలుడు ఘటనకు కారణమైన వారిని అత్యంత కఠిన శిక్ష విధిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోసారి భారత్‌పై ఇలాంటి దాడులు చేయకూడదనే సందేశాన్ని ప్రపంచానికి పంపేలా ఈ శిక్ష ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ప్రధానమంత్రి మోడీ (PM Modi) నేతృత్వంలో ఉగ్రవాదంపై జీరో టాలరెన్స్‌తో ముందుకు సాగుతున్నామని షా తెలిపారు.
“ఉగ్రవాదాన్ని ఏ రూపంలోనూ భారత్ సహించదనే సందేశాన్ని ప్రపంచానికి పంపుతాం. మనదేశానికి హాని తలపెట్టాలని అనుకునే ఎవరికైనా సరే కఠినమైన పరిణామాలు తప్పవనే సందేశం పంపుతాం,” అని అమిత్ షా (Amit Shah) వెల్లడించారు. గుజరాత్లో సైనిక్ స్కూల్‌ను వర్చువల్‌గా ప్రారంభించిన సమయంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
అదే సమయంలో ఢిల్లీ పేలుడు వెనుక జైష్-ఎ-మహమ్మద్ టెర్రర్ మాడ్యూల్ ఉందనే అనుమానాల నేపథ్యంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ తపన్ కుమార్ డేకా, కేంద్ర హోం సెక్రెటరీ గోవింద్ మోహన్లతో అమిత్ షా (Amit Shah) కీలక భేటీ నిర్వహించారు.






