KCR : స్టాలిన్‌కు జైకొట్టిన కేసీఆర్..! మరి జగన్ ఏం చేయబోతున్నారు..?

ఉత్తరాది, దక్షిణాది మధ్య గ్యాప్ పెరుగుతోంది. ఉత్తరాది ఆధిపత్యాన్ని సహించలేని కొన్ని పార్టీలు ఈ అంశాన్ని ఆయుధంగా మలుచుకుంటున్నాయి. అందులో ముందున్నారు డీఎంకే అధినేత, తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ (MK Stalin). నియోజకవర్గాల పునర్విభజనలో దక్షిణాదికి (South India) తీవ్ర అన్యాయం జరుగుతుందని.. దీన్ని ఎదుర్కోకపోతే భవిష్యత్తులో తీవ్రంగా నష్టపోతామని ఆయన చెప్తున్నారు. ఈ అంశంపై చర్చించేందుకు ఈ నెల 22న చెన్నైలో (Chennai) ఓ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దక్షిణాది పార్టీలన్నింటికీ ఆహ్వానాలు కూడా పంపించారు. ఈ సమావేశానికి ఎవరెవరు హాజరవుతారనేదానిపై ఉత్కంఠ కొనసాగుతోంది.
స్టాలిన్ నేతృత్వంలో చెన్నైలో జరిగే సమావేశానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. దక్షిణాదికి చెందిన ప్రముఖ రాజకీయ పార్టీలన్నింటికీ డీఎంకే నేతలు ఆహ్వానాలు అందిస్తున్నారు. తెలంగాణలో (Telangana) బీఆర్ఎస్ (BRS), కాంగ్రెస్ పార్టీలకు ఏపీలో టీడీపీ (TDP), వైసీపీలకు (YCP) ఆహ్వాన పత్రికలను అందించారు. అలాగే కర్నాటక, కేరళ రాష్ట్రాల్లోని పలు రాజకీయ పార్టీలకు కూడా ఆహ్వానాలు అందాయి. కాంగ్రెస్ పార్టీ డీఎంకే (DMK) మిత్రపక్షం కాబట్టి ఆ పార్టీ నేతలు తెలంగాణ, కర్నాటక నుంచి హాజరుకానున్నారు. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డిని (CM Revanth Reddy) కలిసిన డీఎంకే నేతలకు తమ పార్టీ నేతలు వస్తారని చెప్పారు. అలాగే కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కూడా హాజరయ్యే అవకాశం ఉంది.
ఇక తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతో పాటు బీఆర్ఎస్ కూడా హాజరయ్యేందుకు సుముఖత వ్యక్తం చేసింది. గురువారం హైదరాబాద్ లో డీఎంకే మంత్రులు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ను కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు. తాము ఈ సమావేశానికి హాజరవుతామని అప్పుడే కేటీఆర్ ప్రకటించారు. పార్టీ అధినేత కేసీఆర్ ఈ మేరకు ఆదేశించారని.. తాము కచ్చితంగా హాజరవుతామని చెప్పారు. బీజేపీతో (BJP) బీఆర్ఎస్ రహస్యంగా స్నేహం చేస్తోందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. బీఆర్ఎస్ నేతలు కూడా కొన్ని కేసుల్లో ఇరుక్కోవడంతో ఆ పార్టీ నేతలు బీజేపీకి వ్యతిరేకంగా గళం వినిపించే పరిస్థితి ఉండకపోవచ్చని భావించారు. తాజా ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి లబ్ది చేసేందుకే బీఆర్ఎస్ బరిలోకి దిగలేదని చెప్పుకొచ్చారు. కానీ బీఆరెఎస్ మాత్రం చెన్నై వెళ్లి దక్షిణాదికోసం గళం వినిపించాలని నిర్ణయించింది.
ఆంధ్రప్రదేశ్ లో జగన్ (YS Jagan) కు కూడా డీఎంకే నేతలు ఆహ్వానపత్రిక అందించారు. అయితే ఆ సమావేశానికి తాము హాజరవుతామో లేదో జగన్ చెప్పలేదు. ఇప్పటివరకూ ఆపార్టీ అధికారికంగా వెల్లడించకపోవడంతో వెళ్తుందా.. లేదా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. వెళ్తే బీజేపీకి వ్యతిరేకంగా గళం వినిపించాల్సి ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ సాహసం చేయగలదా అనే అనుమానమే. ఒకవేళ వెళ్లకపోతే రాష్ట్ర ప్రయోజనాలను వైసీపీ తాకట్టు పెట్టిందనే విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మరి జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది తెలియాల్సి ఉంది. టీడీపీ తరపున ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు డీఎంకే నేతల ఆహ్వాన పత్రిక అందుకున్నారు. చంద్రబాబు, లోకేశ్ కాకుండా పల్లా శ్రీనివాసరావును కలిశారంటేనే ఈ సమావేశానికి టీడీపీ వెళ్లదని అర్థమైపోతోంది.