Priyanka Gandhi: నాయకత్వం అంటే క్రెడిట్ కాదు.. బాధ్యత కూడా : ప్రియాంక గాంధీ
నాయకత్వం అంటే క్రెడిట్ తీసుకోవడమే కాదని, బాధ్యత కూడా తీసుకోవడమని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) పేర్కొన్నారు. ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) పై లోక్‌సభ లో చర్చ సందర్భంగా ప్రియాంక మాట్లాడుతూ భారత్-పాక్‌ల మధ్య కాల్పుల విరమణ ప్రకటనను అమెరికా అధ్యక్షుడు చేయడం మన ప్రధాన మంత్రి బాధ్యతారాహిత్యాన్ని ప్రతిబింబిస్తోందని అన్నారు. అమిత్ షా (Amit Shah) ప్రసంగాన్ని లక్ష్యంగా చేసుకుంటూ తనదైన శైలిలో ప్రశ్నలు కురిపించారు. జవహర్లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ (Indira Gandhi ) ల విషయాలతోపాటు నా తల్లి కన్నీరు పెట్టిన విషయంపై అమిత్ షా మాట్లాడారు. కానీ, శత్రువులు ఎక్కడికీ వెళ్లలేని సమయంలో యుద్ధాన్ని ఎందుకు ఆపారో అమిత్ షా సమాధానం చెప్పలేదు. నాయకత్వం అంటే క్రెడిట్ తీసుకోవడమే కాదు బాధ్యత కూడా తీసుకోవాలి. ఇలా ఆకస్మికంగా యుద్ధాన్ని ఆపడం దేశ చరిత్రలోనే మొదటిసారి. ఆ ప్రకటన కూడా అమెరికా అధ్యక్షుడు (US President) చేశారు. ఇది మన ప్రధాని బాధ్యతారాహిత్యాన్ని చూపిస్తోంది. మన దౌత్యం విఫలమైంది అని పేర్కొన్నారు.






