మరాఠా రిజర్వేషన్లను రద్దు చేసిన సుప్రీం

మహారాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టు భారీ ఝలక్ ఇచ్చింది. మరాఠా రిజర్వేషన్లను రద్దు చేస్తున్నట్లు బుధవారం సంచలన ప్రకటన చేసింది. ఈ రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని తేల్చి చెప్పింది. 50 శాతానికి మించితే సమానత్వపు హక్కు ఉల్లంఘించినట్టేనని సుప్రీం వ్యాఖ్యానించింది. మరాఠా రిజర్వేషన్లపై ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ‘‘మహారాష్ట్ర సర్కార్ 2018 లో తీసుకొచ్చిన చట్టం సమానత్వపు హక్కును కాలరాసే విధంగా ఉంది. మరాఠాలకు రిజర్వేషన్లను కల్నించేందుకు 50 శాతంగా ఉన్న పరిమితిని ఉల్లంఘించడం ఏమాత్రం సబబు కాదు.’’ అని సుప్రీం వ్యాఖ్యానించింది.
సామాజికంగా వెనుకబడిన వర్గంగా మరాఠా సామాజిక వర్గాన్ని గుర్తిస్తూ మహారాష్ట్ర సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే వారికి విద్యా సంస్థల్లో, ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లను ఏర్పాటు చేస్తూ చట్టం తెచ్చింది. దీనిపై 2019 లో బాంబే హైకోర్ఠు కూడా స్పందించింది. 16 శాతం రిజర్వేషన్ సరైంది కాదని, మరాఠాల కోటా ఉద్యోగాల్లో 12 శాతానికి మించరాదని పేర్కొంది. అంతేకాకుండా అడ్మిషన్లలో 13 శాతం మించరానది స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే బాంబే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంలో పలు పిటిషన్లు దాఖలయ్యాయి.