Supreme Court: బిల్లుల ఆమోదంలో రాష్ట్రపతి కి గడువు.. సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం

దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు(Supreme Court) .. సంచలన నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా బిల్లుల కాలయాపన విషయంలో తీవ్రజాప్యం జరగడం సరికాదని స్పష్టం చేసింది. గవర్నర్లకే కాదు.. సాక్షాత్తూ రాష్ట్రపతికి సైతం గడువు ఉండాల్సిందే అని తేల్చి చెప్పింది. శాసనసభలు ఒకటికి రెండు సార్లు ఆమోదించిన బిల్లులను గవర్నర్లు ఆమోదం తెలపకుండా కాలయాపన చేయడం, రాష్ట్రపతి పరిశీలనలో ఉన్నవీ తీవ్ర జాప్యానికి గురికావడంపై సుప్రీంకోర్టు ప్రశ్నించింది. గరిష్ఠంగా మూడు నెలల్లోగా ఆ బిల్లులను ఆమోదించడమో, తిప్పి పంపించడమో చేయాలని నిర్దేశించింది. బిల్లులను రాష్ట్ర ప్రభుత్వానికి వెనక్కి పంపిస్తున్నట్లయితే అందుకు కారణాలనూ జత చేయాలని తెలిపింది.
ఈ తీర్పు తర్వాత కూడా గవర్నర్లు(Governers) బిల్లులపై జాప్యం చేస్తుంటే సర్వోన్నత న్యాయస్థానాన్ని నేరుగా ఆశ్రయించవచ్చని, గవర్నర్ల నిష్క్రియాపరత్వం న్యాయసమీక్ష పరిధిలోకి వస్తుందని స్పష్టం చేసింది. రాజ్యాంగ అధికరణం 142 ద్వారా అటువంటి సంపూర్ణ అధికారం సుప్రీంకోర్టుకు ఉందని జస్టిస్ జె.బి.పార్దీవాలా, జస్టిస్ ఆర్.మహాదేవన్ ధర్మాసనం తేల్చి చెప్పింది. తమిళనాడు శాసనసభ ఆమోదించిన 10 బిల్లులను ఆ రాష్ట్ర గవర్నరు ఆర్.ఎన్.రవి ఆమోదించకుండా తన వద్దే ఉంచుకోవడం సరికాదని ఈ నెల 8న సుప్రీంకోర్టు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. 415 పేజీల ఆ తీర్పులోని పూర్తి వివరాలు శుక్రవారం రాత్రి సుప్రీంకోర్టు వెబ్‌సైట్ ద్వారా అందుబాటులోకి వచ్చాయి.
తీర్పులోని ముఖ్యమైన అంశాలు
కేసు విచారణ సందర్భంగా కేంద్ర హోంశాఖ సూచించిన 3 నెలల వ్యవధిని.. పరిశీలన నిమిత్తం గవర్నర్లు పంపించిన రాష్ట్రాల బిల్లులపై రాష్ట్రపతి నిర్ణయం తీసుకోవడానికి గడువుగా విధించడం సముచితమని భావించినట్లు ధర్మాసనం తెలిపింది. బిల్లుల ఆమోదానికి ఈ కాల వ్యవధిని మించి జాప్యం జరిగితే అందుకు గల కారణాలను నమోదు చేయాలి. రాష్ట్రపతి పరిశీలన కోసమంటూ బిల్లును గవర్నరు రిజర్వులో ఉంచడం, రాష్ట్రపతి కూడా సమ్మతి తెలపకుండా తన వద్దే నిలిపివేయడం వంటి చర్యలను రాష్ట్ర ప్రభుత్వం నిస్సంకోచంగా సుప్రీంకోర్టులో సవాల్ చేయవచ్చు.
బిల్లులకు ఆమోదం తెలిపే, తిరస్కరించే, రాష్ట్రపతికి పంపించే అధికారాన్ని గవర్నర్లకు రాజ్యాంగ అధికరణం 200 కల్పించింది. దాని అర్థం బిల్లులపై ఎప్పటికీ నిర్ణయం తీసుకోకుండా ఉండమని కాదు. రాష్ట్రాల్లో శాసన నిర్మాణ వ్యవస్థను స్తంభింపజేయమనీ కాదు. అకారణంగా బిల్లులను సుదీర్ఘకాలం నిలిపి ఉంచడం సరికాదని పంజాబ్ రాష్ట్రం కేసులో సుప్రీంకోర్టు తీర్పు స్పష్టం చేసింది.
మంత్రి మండలి సిఫార్సులను ఆమోదించడం రాష్ట్ర గవర్నర్ విధి. రెండోసారి కూడా ఆమోదించి పంపిన బిల్లును రాష్ట్రపతి పరిశీలన కోసమని నిలిపి ఉంచడం లేదా నివేదించడం భావ్యం కాదు. ప్రస్తుతం నిర్దేశించిన కాలవ్యవధిలోగా బిల్లులపై ఎటువంటి నిర్ణయం తీసుకోని గవర్నర్ల నిష్క్రియాపరత్వంపైనా న్యాయసమీక్ష అధికారం కోర్టులకు ఉంటుంది.మంత్రి మండలి సిఫార్సుకు భిన్నంగా బిల్లుకు గవర్నర్ సమ్మతిని నిలిపివేస్తే ఆ బిల్లును 3 నెలల్లోగా తిప్పి పంపించాలి. అందుకు కారణాన్ని తెలపాలి.
మంత్రి మండలి సిఫార్సును కాదని బిల్లును రాష్ట్రపతి పరిశీలనకు పంపించాలని గవర్నర్ భావిస్తే…మూడు నెలలులోగా ఆ పని చేయాలి.రాష్ట్ర శాసనసభ రెండోసారి ఆమోదించి పంపించినట్లయితే ఆ బిల్లుకు గవర్నర్ వెంటనే ఆమోదం తెలపాలి. గరిష్ఠంగా నెలకు మించి సమయం తీసుకోరాదు. అటువంటి బిల్లులను పూర్తిగా నిలిపివేయడం, లేదా తిరస్కరించే అధికారం గవర్నర్‌కు లేదు. రాజ్యాంగ అధికరణం 201 ప్రకారం…రాష్ట్రపతికి కూడా అటువంటి బిల్లులను తిరస్కరించే అధికారం లేదు.
ఇది చరిత్రాత్మకం: కపిల్ సిబల్
రాష్ట్ర అసెంబ్లీలు ఆమోదించిన బిల్లులపై గవర్నర్లు చర్య తీసుకోవడానికి గడువు విధిస్తూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించడాన్ని రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబల్ సమర్థించారు. సమాఖ్య వ్యవస్థకు ఇది ఎంతో మేలు చేస్తుందన్నారు. చరిత్రాత్మక తీర్పు అని కొనియాడారు.
గవర్నర్ కార్యాలయాన్ని చులకన చేసే ఉద్దేశం లేదు
పార్లమెంటరీ ప్రజాస్వామ్య సంప్రదాయాల పరిరక్షణ కోసమే రాష్ట్ర ప్రభుత్వాల బిల్లుల ఆమోదానికి నిర్ణీత కాలవ్యవధిని నిర్ణయించామని సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రత్యేకంగా పేర్కొంది. గవర్నర్ కార్యాలయాన్ని చులకన చేయాలన్న ఉద్దేశం లేదని స్పష్టం చేసింది. చట్టసభల ద్వారా వ్యక్తమయ్యే ప్రజల ఆకాంక్షను, ఎన్నికైన ప్రభుత్వాల అభిప్రాయాలను గౌరవించాల్సిన అవసరం ఉందని తెలిపింది. రాజకీయాలకు అతీతంగా ఒక స్నేహితునిగా, మార్గదర్శిగా, రాజ్యాంగ పరిరక్షకుడిగా గవర్నర్ హుందాగా వ్యవహరించాలని ఆకాంక్షించింది. రాష్ట్ర పాలనాయంత్రాంగం సాఫీగా కొనసాగడానికి, అవరోధాలను తొలగించడానికి గవర్నర్ వివేకం, బుద్ధిసూక్ష్మత ఉపయోగపడాలని పేర్కొంది. గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టే సమయంలో రాజ్యాంగంపై చేసిన ప్రమాణాన్ని విధి నిర్వహణలో అమలు చేయాలని జస్టిస్ జె.బి.పార్దీవాలా, జస్టిస్ ఆర్.మహాదేవన్‌ల ధర్మాసనం సూచించింది. గవర్నర్, రాష్ట్రప్రభుత్వం కలిసికట్టుగా పనిచేయాలని ఆకాంక్షించింది.