America: అమెరికా మాదిరి గోడ కడతారా? : కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీం

అక్రమ వలసదారులను నిరోధించడానికి అమెరికా (America)లో మాదిరిగా సరిహద్దుల్లో గోడ(Wall) నిర్మిస్తారా అని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ముఖ్యంగా బంగ్లాదేశ్ (Bangladesh) నుంచి వచ్చిన వారిని తిప్పి పంపించడానికి అనుసరిస్తున్న ప్రామాణిక నిర్వహణ విధానం (ఎస్‌ఓపీ) ఏమిటని అడిగింది. వీటిపై సమాధానాలు ఇవ్వాలని ఆదేశించింది. బెంగాలీ మాట్లాడుతున్న వలస కార్మికులను బంగ్లాదేశీయులు అన్న అనుమానంతో పలు చోట్ల అదుపులోకి తీసుకోవడాన్ని సవాలు చేస్తూ పశ్చిమ బెంగాల్ (West Bengal) వలసదార్ల సంక్షేమ బోర్డు దాఖలు చేసిన పిటిషన్‌పై ధర్మాసనం విచారణ ప్రారంభించింది. కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ ఇలాంటి విషయాల్లో అసలైన బాధితులు వేసిన పిటిషన్లను స్వీకరించాలే తప్ప సంస్థలు, సంఘాలు వేసినవి కావని అన్నారు. కొన్ని సంఘాలకు రాష్ట్ర ప్రభుత్వాల మద్దతు కూడా ఉందని, కొన్ని ప్రభుత్వాలు అక్రమ వలసదార్ల కారణంగా మనుగడ సాగిస్తున్నాయని తెలిపారు.