Stray Dogs: వీధి కుక్కల సమస్యపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

భారతదేశంలో వీధి కుక్కల (stray dogs) సమస్య దశాబ్దాలుగా సంక్లిష్టమైన అంశంగా ఉంది. ఈ సమస్యపై సుప్రీంకోర్టు (Supreme Court) ఇటీవల తీసుకున్న నిర్ణయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఆగస్టు 11న ఇచ్చిన ఉత్తర్వులను సవరిస్తూ, సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది. వీధి కుక్కల సంక్షేమాన్ని, ప్రజల భద్రతను బ్యాలెన్స్ చేసేలా ఈ తీర్పు కనిపిస్తోంది.
భారతదేశంలో వీధి కుక్కల జనాభా సుమారు 6 కోట్లకు పైగా ఉన్నట్లు అంచనా. ఢిల్లీ-ఎన్‌సీఆర్ (Delhi – NCR) ప్రాంతంలోనే దాదాపు 10 లక్షల వీధి కుక్కలు ఉన్నాయని PETA ఇండియా, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ యానిమల్ ప్రొటెక్షన్ ఆర్గనైజేషన్స్ (FIAPO) వంటి సంస్థలు తెలిపాయి. ఈ కుక్కలు ప్రజలకు, ముఖ్యంగా పిల్లలకు ఇబ్బందికరంగా మారుతున్నాయి. రేబిస్ కు కారణమవుతున్నాయి. వీటిపై ప్రజల నుంచి పెద్దఎత్తున ఫిర్యాదులు కూడా అందాయి. అయితే.. జంతు సంక్షేమ సంఘాలు మాత్రం వీధి కుక్కలను రక్షించాలని, వాటిని చంపవద్దని, షెల్టర్లకు తరలించవద్దని కోరాయి. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ వ్యవహారాన్ని సుమోటోగా స్వీకరించింది.
ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లోని అన్ని వీధి కుక్కలను షెల్టర్ హోమ్‌లకు తరలించాలని ఆగస్టు 11న సుప్రీంకోర్టు ఆదేశించింది. దీనిపై జంతు ప్రేమికులు మండిపడ్డారు. ఢిల్లీ, బెంగళూరు, నాగ్‌పూర్, సిలిగురి వంటి నగరాల్లో పెద్దఎత్తున నిరసనలు చేపట్టారు. కుక్కలను వాటి సహజ వాతావరణంలోనే ఉంచాలని, అవసరమైతే వాటికి స్టెరిలైజేషన్, వ్యాక్సినేషన్ చేయాలని డిమాండ్ చేశాయి. దీంతో ఈ ఆదేశాలపై సుప్రీంకోర్టు పునస్సమీక్షించింది.
సుప్రీంకోర్టు తాజాగా వీధికుక్కలకు సంబంధించి కొన్ని కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆగస్టు 11న చెప్పినట్లు అన్ని కుక్కలను కాకుండా రేబిస్ ఉన్న కుక్కలను అంటే కరిచే కుక్కలను మాత్రమే షెల్టర్లకు తరలించాలని ఆదేశించింది. ఆరోగ్యంగా ఉన్న కుక్కలను వీధుల్లోనే ఉండేందుకు అనుమతించింది. గతంలో షెల్టర్లకు తరలించిన తర్వాత కుక్కలను మళ్లీ విడిచి పెట్టవద్దని చెప్పింది. కానీ ఇప్పుడు మాత్రం అలా శాశ్వతంగా వాటిని షెల్టర్లలో ఉంచడం సరికాదని అభిప్రాయపడింది. వాటి సహజ జీవన వాతావరణాన్ని గౌరవించాలని కోర్టు తెలిపింది. అయితే బహిరంగ ప్రదేశాల్లో వీధి కుక్కలకు ఆహారం పెట్టడం సరికాదని స్పష్టం చేసింది. దీని వల్ల సమస్యలు తలెత్తుతాయని అభిప్రాయపడింది. అందుకే ఆహారం పెట్టేందుకు ప్రత్యేక ప్రదేశాలను ఏర్పాటు చేయాలని స్థానిక అధికారులకు ఆదేశించింది. వీధి కుక్కల సమస్యలు, తీసుకోవాల్సిన చర్యలపై అన్ని రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలకు నోటీసులు జారీ చేసింది. ఈ సవరణలు జంతు సంక్షేమ నియమాలు 2001 ABC రూల్స్ కు అనుగుణంగా ఉన్నాయని పేర్కొంది. ABC నియమాల ప్రకారం, వీధి కుక్కల జనాభా నియంత్రణ కోసం స్టెరిలైజేషన్, రేబిస్ టీకాల కార్యక్రమాలు నిర్వహించాలని స్పష్టం చేసింది.
సుప్రీంకోర్టు సవరణ ఉత్తర్వులపై జంతు ప్రేమికులు మిశ్రమంగా స్పందించారు. PETA ఇండియా, FIAPO వంటి సంస్థలు ఈ సవరణలను స్వాగతించినప్పటికీ, షెల్టర్ల సామర్థ్యం, వాటి నిర్వహణపై ఆందోళన వ్యక్తం చేశాయి. వీధి కుక్కలకు సరిపడా షెల్టర్ల ఏర్పాటు ఆచరణ సాధ్యం కాదని తెలిపాయి. మరోవైపు, రేబిస్ వ్యాధి నియంత్రణ కోసం కోర్టు తీసుకున్న చర్యలను కొందరు సమర్థించారు. పిల్లలు, చిన్నారులు రేబిస్ బారిన పడకూడదు అని సుప్రీంకోర్టు పేర్కొంది.
సుప్రీంకోర్టు సవరణ ఉత్తర్వులు వీధి కుక్కల సమస్యకు ఓ పరిష్కారాన్ని అందించే ప్రయత్నంగా కనిపిస్తున్నాయి. రేబిస్ నియంత్రణ, ప్రజల భద్రతను పరిగణనలోకి తీసుకుంటూనే, కుక్కల స్వేచ్ఛను కాపాడేందుకు కోర్టు చేసిన సవరణలు సానుకూల దిశలో అడుగుగా భావించవచ్చు. అయితే, ఈ ఆదేశాల అమలు స్థానిక అధికారుల సామర్థ్యం, జంతు సంక్షేమ సంస్థల సహకారంపై ఆధారపడి ఉంటుంది.