Supreme Court: కులరాజకీయాలు డేంజర్.. ఏఐఎంఐఎం పార్టీని రద్దు చేయడం కుదరదు: సుప్రీంకోర్టు

కుల రాజకీయాలు దేశానికి ప్రమాదకరమంటూ సుప్రీంకోర్టు (Supreme Court) సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) పార్టీ రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయాలంటూ వేసిన పిటిషన్‌ను తిరస్కరించింది. మైనారిటీలతో సహా వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి కృషి చేయడం ఆ పార్టీ లక్ష్యమని ధర్మాసనం పేర్కొంది. ఇది రాజ్యాంగ విరుద్ధం కాదని, రాజ్యాంగం మైనారిటీలకు కల్పించిన హక్కులను పరిరక్షించడం ఆమోదయోగ్యమేనని కోర్టు (Supreme Court) తెలిపింది. ఏఐఎంఐఎం (AIMIM) రిజిస్ట్రేషన్‌ను సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను వెనక్కి తీసుకోవాలని సూచించిన సుప్రీంకోర్టు.. దీనికి బదులుగా రాజకీయ పార్టీల సంస్కరణలపై సమగ్ర పిటిషన్‌ను దాఖలు చేయాలని కోరింది. ఏ ఒక్క పార్టీని లక్ష్యంగా చేసుకోకుండా, దేశానికి ప్రమాదకరంగా మారిన కుల రాజకీయాలపై దృష్టి సారించే విస్తృత పిటిషన్‌ను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నామని సుప్రీంకోర్టు (Supreme Court) స్పష్టం చేసింది.