Sudarshan Reddy: సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు.. అమిత్ షా వ్యాఖ్యలపై జస్టిస్ సుదర్శన్ రెడ్డి
ప్రస్తుతం దేశంలో ప్రజాస్వామ్యం, రాజ్యాంగం సవాళ్లు ఎదుర్కొంటున్నాయని ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ బి. సుదర్శన్‌రెడ్డి (Sudarshan Reddy) ఆందోళన వ్యక్తం చేశారు. ఉపరాష్ట్రపతి (Vice President) ఎన్నిక కేవలం వ్యక్తుల మధ్య పోటీ కాదని, రెండు విభిన్న భావజాలాల మధ్య పోరాటమని ఆయన అన్నారు. పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ అభిప్రాయాలు పంచుకున్నారు. ‘సల్వా జుడుం’ తీర్పుపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) చేసిన వ్యాఖ్యలపై స్పందించిన ఆయన (Sudarshan Reddy).. అది తాను రాసిన తీర్పు కాదని, సుప్రీం కోర్టు ఇచ్చినదని స్పష్టం చేశారు. ఆ తీర్పు 40 పేజీలను అమిత్ షా చదివి ఉంటే అటువంటి వ్యాఖ్యలు చేసేవారు కాదని ఆయన పేర్కొన్నారు.
అలాగే సామాజిక ఆర్థిక విధానాల రూపకల్పన కోసం కుల గణన అవసరమని జస్టిస్ సుదర్శన్‌రెడ్డి (Sudarshan Reddy) అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం దేశంలో జాతీయ అంశాలపై అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య సమన్వయం లోపించిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంటులో సభ్యుల అంతరాయం ఒకరకమైన నిరసన మాత్రమేనని, అది ప్రజాస్వామ్య ప్రక్రియలో ఒక భాగంగా మారకూడదని సూచించారు. ప్రస్తుతం దేశంలో ప్రజాస్వామ్యం ఒత్తిడికి గురవుతోందని ఆయన (Sudarshan Reddy) అభిప్రాయపడ్డారు. అయినప్పటికీ, మనది ఇప్పటికీ రాజ్యాంగబద్ధమైన ప్రజాస్వామ్యమేనని ఆయన స్పష్టం చేశారు. విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా ఎంపిక కావడం 64 శాతం ప్రజల ప్రాతినిధ్యాన్ని సూచిస్తుందని, ఇది తనకు దక్కిన గౌరవమని ఆయన (Sudarshan Reddy) అన్నారు.








