Mallikarjun Kharge: బీజేపీ అసమర్థత వల్లే ఇన్ని ప్రమాదాలు.. మండిపడ్డ ఖర్గే

గుజరాత్‌లో బ్రిడ్జి కూలిన ఘటనపై స్పందించిన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge).. కేంద్ర ప్రభుత్వం, బీజేపీపై (BJP) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బీజేపీ నాయకత్వ లోపం, అసమర్థ పాలన వల్లే దేశంలో అన్ని రకాలుగా అవినీతి పెరిగిపోయిందని ఆయన అన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, ఉదాసీనత వల్లే గుజరాత్‌లో వంతెన కూలడం, అంతకుముందు అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం వంటి విషాద ఘటనలు జరితాయయని ఖర్గే (Mallikarjun Kharge) ఆరోపించారు. ప్రభుత్వ వైఖరి ఇలాగే కొనసాగితే తగిన సమయంలో ప్రజలే సరైన గుణపాఠం చెబుతారని ఆయన ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు.
బుధవారం నాడు గుజరాత్‌లోని (Gujarat) వడోదర జిల్లాలోని గంభీరా వంతెన ప్రధాన భాగం కూలిపోవడంతో పలు వాహనాలు నదిలో పడిపోయాయి. గురువారం మరో నలుగురి మృతదేహాలు లభ్యం కావడంతో మృతుల సంఖ్య 15కు చేరిందని అధికారులు వెల్లడించారు. ఇంకా మరో నలుగురి ఆచూకీ లభ్యం కావాల్సి ఉందని తెలిపారు. గత నెలలో అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో (Air India Crash) 260 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ వరుస ప్రమాదాలనే ఖర్గే (Mallikarjun Kharge) ఎత్తిచూపారు. దేశంలో ప్రమాదాలు సర్వసాధారణంగా మారిపోయాయని, రైలు ప్రమాదాలు, వంతెనలు కూలిపోవడం, విమాన ప్రమాదాలు వంటి వరుస ఘటనలతో ప్రజల్లో బీజేపీ పాలన పట్ల భయం పెరుగుతోందని ఆయన పేర్కొన్నారు.
తాజాగా వంతెన కూలిన ఘటన గురించి తెలియగానే దిగ్భ్రాంతికి గురయ్యానని, 12 మంది వరకు మరణించడం విషాదకరమని ఖర్గే అన్నారు. ప్రమాదానికి మూడేళ్ల నుంచే వంతెన పరిస్థితి దారుణంగా ఉందని, మరమ్మతులు చేయాలని చెప్పినప్పటికీ ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని ఆయన (Mallikarjun Kharge) ఆరోపించారు. 2021 నుంచి ఇప్పటివరకు గుజరాత్‌లో ఏడు వంతెన ప్రమాదాలు చోటుచేసుకున్నాయని ఖర్గే తన పోస్ట్‌లో వెల్లడించారు.