Shashi Tharoor : భారత్‌పై ట్రంప్ సుంకాలు ఓ పాచిక : శశి థరూర్
భారత ఉత్పత్తులపై 25 శాతం సుంకంతోపాటు జరిమానాలు విధిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) చేసిన ప్రకటన బేరసారాల కోసం వేసిన ఓ పాచికని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ (Shashi Tharoor) వ్యాఖ్యానించారు. పార్లమెంటు వెలుపల శశి థరూర్ మీడియాతో మాట్లాడారు. వాణిజ్య ఒప్పందం కోసం ఇరు దేశాల ప్రతినిధుల మధ్య జరుగుతున్న చర్చల్లో భారత్ (India) తలొగ్గనవసరం లేదని, మనకు అనుకూలంగా ఉండేలా ఒప్పందానికి ప్రయత్నించాలని సూచించారు. ఒకవేళ అలాంటిది సాధ్యం కాకపోతే చర్చల నుంచి బయటకు వచ్చేయాలని పేర్కొన్నారు. భారత వాణిజ్యానికి అమెరికా (America) అతి పెద్ద మార్కెట్. మన ఎగుమతులే 9 వేల కోట్ల డాలర్ల వరకూ ఉంటాయి. సుంకాల నేపథ్యంలో ఎగుమతులు తగ్గితే మనకు నష్టమే. అయినా అమెరికా డిమాండ్లు పూర్తిగా అర్థం లేనివి. వాటిని ప్రతిఘటించే హక్కు భారత్‌కు ఉంది. వారిని సంతోషపెట్టడానికి మన జీవనోపాధిని పణంగా పెట్టలేం అని పేర్కొన్నారు.






