Delhi: రూపాయి సింబల్ ఎలా పుట్టింది..? ఎంపిక ప్రక్రియలో వివాదమేంటి?

కేంద్రం, తమిళనాడు ప్రభుత్వాల మధ్య హిందీ గొడవ.. ‘రూపీ’ లోగో వివాదానికి దారితీసింది. ఆ రాష్ట్ర బడ్జెట్ లోగోలో ఇప్పటివరకు ఉన్న ₹ అనే లోగో స్థానంలో తమిళంలోని ‘రూ’ అనే తమిళ అక్షరాన్ని మార్చడమే ఇందుక్కారణం. అయితే, రూపాయిని (Indian rupee) సూచించే ఈ ₹ గుర్తును ఓ తమిళ వ్యక్తే రూపొందించాడఉ. మూడు వేలకు పైగా వచ్చిన గుర్తులతో పోటీపడి ఇది విజయం సాధించింది. అయితే దీని ఎంపిక ప్రక్రియా ఓ వివాదంగా పరిణమించింది.
భారత రూపాయి (Indian rupee)ని సూచించడానికి ఓ మంచి సంకేతం కావాలంటూ 2009 మార్చి 5న కేంద్ర ప్రభుత్వం ఓ పోటీని నిర్వహించింది. ఆ గుర్తు మన విలువలు, సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఉండాలని 2010 కేంద్ర బడ్జెట్ సందర్భంగా నాటి ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ తెలిపారు. ఈ పోటీకి దేశవ్యాప్తంగా 3,331 స్పందనలు వచ్చాయి. అన్ని గుర్తుల్లో నుంచి ఐదు సింబల్స్‌ను షార్ట్‌లిస్ట్ చేశారు. నందిత మెహ్రోత్రా, హితేశ్ పద్మశాలి, షిబిన్ కేకే, షారుఖ్ ఇరానీ, డి.ఉదయ్‌కుమార్ రూపొందించిన గుర్తులు ఈ జాబితాలో ఉన్నాయి. 2010 జూన్‌లో కేంద్ర మంత్రివర్గం సమావేశమై వీటిల్లో ఒకదాన్ని ఫైనల్ చేసింది. ఉదయ్‌కుమార్ రూపొందించిన ₹ గుర్తు విజేతగా నిలిచినట్లు అదే ఏడాది జులైలో ఆర్థికశాఖ ప్రకటించింది. ఈయన తమిళనాడుకు చెందిన డీఎంకే మాజీ ఎమ్మెల్యే కుమారుడు.
సమానత్వాన్ని సూచిస్తూ..
దేవనాగరి లిపిలోని ‘ర’, లాటిన్ బాషలోని ‘ఆర్’ అక్షరాన్ని మిళితం చేసి ఈ ₹ సింబల్‌ను ఉదయ్‌కుమార్ రూపొందించారు. పైనున్న రెండు అడ్డగీతలు మన జాతీయ పతాకాన్ని, సమానత్వాన్ని సూచిస్తాయి. అంటే ఆర్థిక అసమానతలను తగ్గించాలనే ఉద్దేశంతో దీన్ని ఇలా తీర్చిదిద్దారు. 2010 నుంచి భారత ప్రభుత్వం ఈ గుర్తును అధికారికంగా వినియోగిస్తోంది. అప్పటినుంచి నాణేలు, కరెన్సీ నోట్లతో పాటు పోస్టల్ స్టాంప్‌లు, బ్యాంకు చెక్కులోనూ ఈ సింబల్ మనకు కన్పిస్తోంది.
ఎంపిక వివాదాస్పదం..
అయితే, దీని ఎంపిక అప్పట్లో వివాదాస్పదమైంది. రూపీ సింబల్ పోటీదారుల్లో ఒకరైన రాకేశ్‌కుమార్ అనే వ్యక్తి ఎంపిక ప్రక్రియను సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పోటీలో వివక్షపూరితంగా వ్యవహరించారని, లోపాలు, అసమానతలు ఉన్నాయని ఆరోపించారు. అయితే, వాటిని రుజువు చేసే ఆధారాలు లేకపోవడంతో ఆయన పిటిషన్‌ను హైకోర్టు సింగిల్ బెంచ్ కొట్టేసింది.
అనంతరం ఈ వ్యవహారం డివిజన్ బెంచ్‌కు చేరగా.. న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇకపై జాతీయసంస్థల చిహ్నాలు, లోగోలను రూపొందించడానికి నిర్వహించే ప్రజా పోటీల్లో అవకతవకలు జరగకుండా మార్గదర్శకాలను రూపొందించాలని కేంద్రానికి చెందిన అన్ని మంత్రిత్వశాఖలను ఆదేశించింది. 2013 ఏప్రిల్‌లో ఆర్థికశాఖ ఇందుకోసం మార్గదర్శకాలు జారీ చేసింది.