జీఎస్పీ ని అమెరికా పునరుద్ధరించాలి
భారత ఎగుమతిదార్లకు జీఎస్పీ ప్రయోజనాలను అమెరికా పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని ఎగ్జిమ్పై భారతీయ పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) ఏర్పాటు చేసిన జాతీయ కమిటీ చైర్మన్ సంజయ్ బుధియా అభిప్రాయపడ్డారు. దేశీయ ఎగుమతిదార్లకు జనరలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ (జీఎస్పీ) ప్రయోజనాలను పునరుద్ధరించాలన్న డిమాండ్‌పై, భారత్‌తో చర్చించడానికి అమెరికా అంగీకరించిన సంగతి తెలిసిందే. ఇరు పక్షాలు త్వరలోనే చర్చలు చేపట్టనున్నాయి. ట్రంప్ ప్రభుత్వం 2019లో భారత్‌కు జీఎస్పీని రద్దు చేసింది. జీఎస్పీ కింద అమెరికాకు అర్హత గల అభివృద్ధి చెందుతున్న దేశాలు సుంకం రహిత ఎగుమతులు చేయడానికి వీలుంటుంది. జీఎస్పీ కింద అమెరికా చేసుకునే దిగుమతుల్లో మూడింట రెండొంతులు, అమెరికా కంపెనీలు వస్తువుల తయారీకి వాడే ముడి పదార్థాలు, విడిభాగాలు లేదా మెషనరీ, సామగ్రి ఉంటున్నాయని బుధియా పేర్కొన్నారు. జీఎస్పీ వల్ల అమెరికా వినియోగదార్లు సైతం ప్రయోజనం పొందుతారు. పలు వినియోగదారు వస్తువులపై వారికి సుంకం ఉండదు. అందుకే జీఎన్పీపై త్వరగా ఒక నిర్ణయానికి రావాల్సిన అవసరం ఉందని అన్నారు. 2030 కల్లా ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 500 బి. డాలర్లకు చేర్చాలన్న లక్ష్యాన్ని చేరాలంటే భాగస్వామ్యం, సమకారాన్ని వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు.






