Danam Nagender:ఆ పార్టీ నుంచి నన్ను సస్పెండ్ చేయలేదు : దానం
తాను ఇప్పటికీ బీఆర్ఎస్(BRS) సభ్యుడినే అని, పార్టీకి రాజీనామా చేయలేదని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ (Danam Nagender) స్పష్టం చేశారు. తనపై పార్టీ ఎలాంటి సస్పెన్షన్, బహిష్కరణ ఉత్తర్వులు కూడా జారీ చేయలేదని ఆయన పేర్కొన్నారు. తనపై ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి (Padi Kaushik Reddy) దాఖలు చేసిన అనర్హత పిటిషన్ పూర్తిగా అసత్య ఆరోపణలే అని దానం తెలిపారు. ఊహాగానాలు, మీడియా కథనాలపై ఆధారపడి ఈ ఆరోపణలు చేసినట్లుగా ఉందన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున శాసనసభ్యుడిగా గెలిచి కాంగ్రెస్‌లోకి ఫిరాయింపునకు పాల్పడ్డారని దానం నాగేందర్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి స్పీకర్‌కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద దానంను ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటించాలని కోరారు. దానంపైనే బీజేపీ ఎమ్మెల్యే ఏలేటీ మహేశ్వర్ రెడ్డి (Eleti Maheshwar Reddy) సైతం అనర్హత పిటిషన్ వేశారు. ఈ ఇద్దరి పిటిషన్లపై ఈ నెల 30న స్పీకర్ విచారణ జరపనున్నారు.






