Aruri Ramesh: బీఆర్ఎస్ లో చేరిన ఆరూరి రమేశ్
రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజల గురించి ఏమాత్రం ధ్యాస లేదని, అందుకే ఇచ్చిన అన్ని హామీలను తుంగలో తొక్కిందని బీఆర్ఎస్ అధ్యక్షుడు కేటీఆర్ (KTR) విమర్శించారు. తెలంగాణ భవన్లో జరిగిన కార్యక్రమంలో బీజేపీ (BJP)కి రాజీనామా చేసిన బీఆర్ఎస్లో చేరిన వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్‌కు (Aruri Ramesh) కేటీఆర్ గులాబీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ అన్ని వర్గాలను మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి వచ్చే పురపాలక ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. రానున్న ప్రతి ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ అభ్యర్థుల విజయం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. రమేశ్ గతంలో వర్ధన్నపేట (Wardhannapet) నియోజకవర్గాన్ని అద్భుతంగా అభివృద్ధి చేశారని, దాదాపు లక్ష ఓట్ల మెజారిటీతో గెలిచిన ఆయన 16 ఓట్ల తేడాతో ఓడిపోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. పార్టీలో అందరినీ కలుపుకొని ముందుకెళ్లి, మునిసిపల్ ఎన్నికల్లో అద్భుతమైన విజయం సాధించాలని రమేశ్‌ను కోరారు. ఈ కార్యక్రమంలో శాసనసభలో బీఆర్ఎస్ పక్ష ఉపనేత హరీశ్‌రావు, నేతలు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.






